ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మరణించి ఇన్నేళ్లవుతున్నా.. ఆ పేరు వింటేనే ఇప్పటికీ అభిమానుల నరాలు జివ్వుమంటాయి. లేటెస్ట్ గా అంటోనీ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ (Michael) . ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 24, 2026న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ రికార్డులు..
ఈ ఏడాదిలోనే అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ రిలీజ్‌గా ‘మైఖేల్’ (Michael) చిత్రం నిలిచింది. కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.4,350 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ చేసింది. థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. భారత్‌లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దేశవ్యాప్తంగా 30,795 షోల ద్వారా ఈ సినిమా రూ.45.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. వర్కింగ్ డేస్‌తో పోలిస్తే వీకెండ్స్‌లో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
మైఖేల్‌ను దించేసిన జెఫర్
మైఖేల్ జాక్సన్ సొంత మేనల్లుడు జెఫర్ జాక్సన్ (Jaafar Jackson) ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేయడం విశేషం. జాక్సన్ 5 గ్రూప్‌తో మైఖేల్ చైల్డ్‌హుడ్ కెరీర్ ఎలా మొదలైంది? ఆ తర్వాత ఆయన ఒంటరిగా గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగారు? అనే అద్భుత ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. జెఫర్ తన నటన, మేనరిజమ్స్,ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అచ్చు మైఖేల్‌ను దించేసి ప్రేక్షకులను నాస్టాల్జియా ట్రిప్‌కు తీసుకెళ్లాడు.
మైఖేల్ మ్యాజిక్కు సెలబ్రిటీల ఫిదా!
ఈ సినిమా చూసి భారతీయ సెలబ్రిటీలు ఎమోషనల్ అవుతున్నారు. నటుడు ఫర్దీన్ ఖాన్ తన పిల్లలతో కలిసి ఈ సినిమా చూసిన అనుభవాన్ని పంచుకుంటూ.. మైఖేల్లోని ఒక సాధారణ మనుషిని, ఆయన పడిన సంఘర్షణను ఈ సినిమా చూపించింది. నా పిల్లలతో కలిసి ఈ మ్యాజిక్‌ను మళ్లీ అనుభవించడం గొప్ప అనుభూతి అని ఎమోషనల్ అయ్యారు.
►ALSO READ | త్రిష ఒక పరాన్నజీవి.. విజయ్ సక్సెస్‌ను వాడుకుంటోంది.. సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!
మరోవైపు, ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1999లో మ్యూనిచ్‌లో జరిగిన ‘మైఖేల్ జాక్సన్ అండ్ ఫ్రెండ్స్’ కన్సర్ట్‌లో పాల్గొని, స్వయంగా ఎంజేను కలవడం తన జీవితంలోనే అతిపెద్ద క్షణమని ఆయన గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ఈ బయోపిక్ విజయం.. మైఖేల్ జాక్సన్ మ్యూజిక్కు ఎప్పటికీ మరణం లేదని మరోసారి నిరూపించింది. మ్యూజిక్ లవర్స్‌కు థియేటర్లలో ఇదొక ఐ ఫీస్ట్ నిలుస్తోంది.
