క్వార్టర్స్ లీజును క్యాన్సిల్ చేయాలి .. ఓయూలో ఏబీవీపీ నేతలు ఆందోళన

క్వార్టర్స్ లీజును క్యాన్సిల్ చేయాలి .. ఓయూలో ఏబీవీపీ నేతలు ఆందోళన

ఓయూ, వెలుగు: తార్నాక ఆర్టీసీ హాస్పిటల్​కు ఎదురుగా ఉన్న ఓయూ ప్రొఫెసర్స్ క్వార్టర్లను ఆదిధ్వని సంస్థకు 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చారని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. లీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోమవారం క్వార్టర్స్ రెనవేషన్​ను అడ్డుకొని కాంట్రాక్టర్ తో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ..  ఒకపక్క వర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతుంటే మరోపక్క నిబంధనలకు విరుద్ధంగా క్వార్టర్స్ ను లీజుకు ఇస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు క్వార్టర్లను లీజుకు ఇచ్చారని, మరో క్వార్టర్ ను కూడా లీజుకు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారన్నారు. 

రూ. వెయ్యికి లీజుకివ్వడంలో మతలబేంటి?

ఓయూ ప్రొఫెసర్స్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తే తరిమి కొడతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేశ్ గౌడ్ హెచ్చరించారు. ప్రొఫెసర్లకు కేటాయించిన పీ2, పీ3 నివాస గృహలను ఆదిధ్వని ప్రతినిధులు వారికి అనుకూలంగా రిపేర్లు చేసుకోవడంతో పాటు ఎకరాల స్థలాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఈ క్వార్టర్స్ లో నివాసం ఉండే ప్రొఫెసర్ల నుంచి హెచ్ఆర్ఏ రూ.40 వేలు తీసుకుంటున్న వర్సిటీ అధికారులు.. ఆదిధ్వని సంస్థకు మాత్రం నెలకు కేవలం వెయ్యి రూపాయలకే 30 ఏండ్ల పాటు లీజుకివ్వడంలో మతలబేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.