ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌ యూనియన్‌‌ (డీయూఎస్‌‌యూ) ఎన్నికల్లో ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్‌‌(ఏబీవీపీ) ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింట ఏబీవీపీ గెలిచింది. ఒక స్థానంలో కాంగ్రెస్‌‌ అనుబంధ సంస్థ నేషనల్‌‌ స్టూడెంట్స్‌‌ యూనియన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎన్‌‌ఎస్‌‌యూఐ) అభ్యర్థి గెలుపొందారు. 

భారీ భద్రత మధ్య ఢిల్లీ వర్సిటీలోని నార్త్‌‌ క్యాంపస్‌‌లో ఉన్న స్పోర్ట్స్‌‌ సెంటర్‌‌‌‌లో ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్‌‌ మాన్‌‌ ప్రెసిడెంట్‌‌గా గెలుపొందారు. కాంగ్రెస్‌‌ ఎన్‌‌ఎస్‌‌యూఐ అభ్యర్థి జోస్లిన్‌‌ నందితా చౌదరిపై 16,196 కోట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అయితే, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఎన్‌‌ఎస్‌‌యూఐ అభ్యర్థి రాహుల్‌‌ జంస్లా గెలుపొందారు. 

రాహుల్‌‌కు 29,339 ఓట్లు రాగా, ఏబీవీపీ అభ్యర్థి గోవింద్‌‌ తాన్వర్‌‌‌‌కు 20,547 ఓట్లు పోల్‌‌ అయ్యాయి. సెక్రటరీగా ఏబీవీపీ అభ్యర్థి కునాల్‌‌ చౌధరి 23,779 ఓట్లు సాధించి, సమీప అభ్యర్థి కబీర్‌‌‌‌పై గెలుపొందారు. జాయింట్‌‌ సెక్రటరీగా ఏబీవీపీ దీపిక ఝూ.. ఎన్‌‌ఎస్‌‌యూఐ అభ్యర్థి లవకుశ భదనపై విజయం సాధించారు. దీపికకు 21,825 ఓట్లు రాగా, లవకుశకు 17,380 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు, స్టూడెంట్స్ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌ఎఫ్‌‌ఐ), ఆల్‌‌ ఇండియా స్టూడెంట్స్‌‌ అసోసియేషన్‌‌ (ఏఐఎస్‌‌ఏ)కు ఒక్క సీటూ రాలేదు.

అమిత్‌‌ షా, నడ్డా అభినందనలు..

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుపొందిన ఏబీవీపీ అభ్యర్థులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.