మూడు కార్పొరేషన్లపై ఏసీబీ, విజిలెన్స్ నిఘా... విభజన టైంలో జరిగిన అవకతవకలపై ఫోకస్

మూడు కార్పొరేషన్లపై ఏసీబీ, విజిలెన్స్ నిఘా... విభజన టైంలో జరిగిన అవకతవకలపై ఫోకస్
  • ఇచ్చిన పర్మిషన్లు, చేసిన పనులు, బిల్లుల జారీపై విచారణ
  • ఇప్పటికే బడంగ్ పేట డీసీ సహా మరో 10 మంది పై వేటు 
  • అన్ని సర్కిళ్లలో ఇదే తరహా విచారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లపై ఏసీబీ, విజిలెన్స్ నిఘా పెట్టాయి. మూడు కార్పొరేషన్ల విభజనకి 6 నెలల ముందు  ఇచ్చిన అనుమతులు, చేసిన పనులు, వాటి బిల్లుల జారీతో పాటు ఇతర అంశాలపైనా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల్లో అవకతవకలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో బల్దియా అధికారుల్లో వణుకు మొదలైంది. విభజన జరిగితే తాము దాటుకోవచ్చన్న ధీమాతో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

విభజన టైంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ అంశంపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ చాలా మంది పెడచెవిన పెట్టారు. ముందు బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కమిషనర్ కు నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్టులు నమ్మశక్యంగా లేకపోవడంతో కమిషనర్ రహస్యంగా మరో విజిలెన్స్ టీమ్​ను ఏర్పాటు చేశారు. వారు డిప్యూటీ కమిషనర్ అవినీతి, అక్రమాలు  నిజమేనని తేల్చారు. 

దీంతో డిప్యూటీ కమిషనర్​తో పాటు 10 మందిపై  సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే గత నెలలో శేరిలింగంపల్లిలోనూ ఏసీబీ రైడ్స్​చేసి విభజన టైంలో భవన నిర్మాణాలకి సంబంధించిన ఫైళ్లని పరిశీలించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించింది. అధికారులకు, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు తెలుసుకుంది. 

కొద్ది రోజుల్లోనే క్లియర్​

విభజన టైంలో నెలకొన్న గందరగోళాన్ని కొందరు అధికారులు క్యాష్ చేసుకున్నట్లు తెలిసింది. సాధారణంగా నెలల తరబడి పెండింగ్​లో ఉండే ఫైళ్లు, ఆ టైంలో కేవలం కొద్ది రోజుల్లోనే క్లియర్ కావడంతో అధికారులు ఆరా తీస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ వెనుక భారీగా డబ్బులు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. మెజర్ మెంట్ బుక్(ఎంబీ) లలో తప్పుడు ఎంట్రీలు చేయడంపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఆరు నెలల్లో క్లియర్ అయిన భారీ మొత్తాల బిల్లుల ఫైళ్లను కొన్ని సర్కిల్స్ లో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. 

అన్ని సర్కిళ్లలో విచారణ..

ఇంజినీరింగ్ విభాగంలో సివిల్ పనుల నాణ్యతపై అధికారులు దృష్టి సారించారు.  పని పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బిల్లులు చెల్లించడం, పాత పనులకే కొత్త రంగులద్ది నిధులు స్వాహా చేయడం వంటి వ్యవహారాలపై విజిలెన్స్ అధికారులు కన్నేశారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లోని అన్ని సర్కిళ్లలోనూ ఇదే తరహాలో రికార్డులను తనిఖీ చేయనున్నారు. ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా పనులను చెక్​చేయనున్నారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో మరిన్ని సస్పెన్షన్లు, అరెస్టులు ఉండే అవకాశం ఉందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.