మేడ్చల్/గండిపేట, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తో పాటు అధికారులు సుమారు రెండు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో వారి దగ్గర ఉన్న దస్తావేజులు తీసుకుని అసలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అప్పగించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు తెలిపారు.
గండిపేటలోనూ సోదాలు
నార్సింగి మున్సిపాలిటీ గండిపేట సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాయలయంలోనూ శుక్రవారం మధ్యాహ్నం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మికాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్యాలయంలోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. కార్యాలయాల్లోకి బయట వ్యక్తులు ఎవరూ రావద్దని కేవలం రిజిస్ట్రేషన్ చేసుకునే వారు మాత్రమే రావాలని సూచించారు. రైటర్స్ నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.
