శివబాలకృష్ణ కేసు.. అధికారుల్లో టెన్షన్‌!

శివబాలకృష్ణ కేసు.. అధికారుల్లో టెన్షన్‌!
  •  శివ బాలకృష్ణ  కేసులో ఇంకొందరు అరెస్టు ఖాయమన్న ఏసీబీ 
  •     ఎప్పుడు పిలుపు వస్తుందోననే భయాందోళనలో అధికారులు  
  •      మాజీ డైరెక్టర్ కు ఇంకొందరు బినామీలు ఉన్నట్లు ప్రచారం 
  •     ప్లానింగ్, ఇంజనీరింగ్​ విభాగాల్లోనే ఎక్కువ అవినీతి 

హైదరాబాద్, వెలుగు:
 హెచ్‌ఎండీఏ మాజీ  డైరెక్టర్ శివబాలకృష్ణ  అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆ డిపార్ట్  మెంట్‌లో అలాంటి వారు ఎంతమంది ఉన్నారోననేదానిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  అవినీతి  కేసులో అరెస్టయిన శివబాలకృష్ణ  అక్రమ ఆస్తులు విచారణలో వాస్తవాలు బయటపడుతుండగా... మరికొంత మంది అధికారులను అరెస్టు చేస్తామని ఏసీబీ ప్రకటించింది. దీంతో  ఇప్పుడు హెచ్ఎండీఏ అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది.  ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోననే భయాందోళనలో ఉన్నారు. 

కొందరు అధికారులు అందుబాటులో ఉండడం లేదని, మరికొందరు టెన్షన్‌తో పనులను వాయిదా వేస్తున్నట్టు సమాచారం.  కొన్ని రోజులుగా హెచ్‌ఎండీఏలోని ప్లానింగ్, ఇంజినీరింగ్ ​విభాగాల్లో పనులే నిలిచిపోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు.  మాజీ డైరెక్టర్‌‌ శివబాలకృష్ణ అరెస్టు, విచారణతో హెచ్‌ఎండీఏలో పలువురు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. 

ఎవరికి పిలుపు వస్తుందోననే ..

గతంలో శివబాలకృష్ణ అనుమతించిన ప్రాజెక్టులను క్లియర్​ చేసిన ఎంఏయూడీ అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొన్నట్టు సమాచారం.  హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో పని చేసి ప్రస్తుతం ఎంఏయూడీలోకి బదిలీ అయిన ఓ అధికారి లాంగ్‌ లీవ్‌లో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. శివబాలకృష్ణ పనిచేసిన కాలంలో ఆయన వద్ద పని చేసిన ప్లానింగ్​అధికారుల్లో కొందరు లే అవుట్, బిల్డింగ్ ​పర్మిషన్లకు భారీగా  ముడుపులు తీసుకున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.  

ఇంజినీరింగ్‌ విభాగంలోనూ కొందరు శివబాలకృష్ణ  ప్రలోభాలకు గురైన అధికారులు ఉన్నట్లు సమాచారం.  అతని వద్ద పనిచేసిన  కొందరు నమ్మకస్తులను కూడా బినామీలుగా పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.   అతని చాంబర్‌‌లో పని చేసిన ఓ ఉద్యోగి సైతం శివబాలకృష్ణ బినామీయేనని  కొందరు చెబుతున్నారు.  అందుకే ఆయన అరెస్ట్ తో  టెన్షన్‌కు గురై ఆ ఉద్యోగి​ మృతి చెందాడని హెచ్‌ఎండీఏ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.  

ఫైళ్లు కదలాలంటే ఏజెన్సీల ద్వారానే !

హెచ్‌ఎండీఏలో ప్లానింగ్,  ఇంజినీరింగ్​విభాగంల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎవరి ఫైల్​అయినా ముందుకు కదలాలంటే  ఏజెన్సీలను పట్టుకుంటే పనులు సులువుగా జరిగిపోతుందంటున్నారు.  అధికా రులకు నచ్చిన ఏజెన్సీల ద్వారా వెళితే ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక రేటు ఫిక్స్​చేసి వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.  గత బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం  చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో  కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ముఖ్యంగా  లే అవుట్లకు అనుమతి ఇవ్వాలంటే  ఆ వెంచర్‌‌లో  ప్లాట్లు ఇవ్వడం లేదా డెవలప్‌ చేయడానికి తమ వారికి అవకాశం ఇవ్వాలని కొందరు వెంచర్ల యజమానులకు టౌన్​ప్లానింగ్​అధికారులు ఆదేశాలు జారీ చేస్తుంటారు.  ఇక ప్లానింగ్‌లోనే కాకుండా గ్రేటర్​పరిధిలో  చేపట్టిన పలు నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల నిర్మాణంలో నూ ఇంజనీరింగ్​అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  ఏసీబీ అధికారులు దృష్టి పెడితే ఇలాంటి అధికారులు కూడా దొరికే చాన్స్ ఉంది.