ఓయూ ఫండ్స్ స్కామ్​లో ఏసీబీ కోర్టు తీర్పు చెల్లదు

ఓయూ ఫండ్స్ స్కామ్​లో ఏసీబీ కోర్టు తీర్పు చెల్లదు
  •     30 ఏండ్ల కిందటి కేసులో తీర్పునిచ్చిన హైకోర్టు
  •     ఆరుగురు నిర్దోషులుగా విడుదల

హైదరాబాద్, వెలుగు: శాఖాపరమైన విచారణలోని నివేదిక ఆధారంగా క్రిమినల్‌‌‌‌ కేసుల విచారణ పూర్తి చేసి ఏసీబీ కోర్టు తీర్పు చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చట్ట వ్యతిరేకమని చెప్పింది. ఆ విధంగా క్రిమినల్‌‌‌‌ కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు ఏసీబీ కోర్టు శిక్ష విధించడం చెల్లదని ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది కేసులో హైకోర్టు తీర్పు చెప్పింది. 

ఆ రిపోర్టు మేరకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిందితులను ఏసీబీ కోర్టు కోరడం చెల్లదని స్పష్టం  చేసింది. క్రిమినల్‌‌‌‌ కేసు విచారణ బాధ్యత పూర్తిగా ప్రాసిక్యూషన్‌‌‌‌పై ఆధారపడి ఉంటుందని చెప్పింది. బ్యాంకుల నుంచి నిధులను డ్రా చేశారనడానికి బ్యాంకు నుంచి ఎలాంటి సాక్ష్యం లేకుండా, బ్యాంకు సిబ్బందిలో ఒక్కరిని కూడా విచారణ చేయకుండా నిందితులకు ఏసీబీ కోర్టు శిక్ష వేయడం చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె.సురేందర్‌‌‌‌ ఇటీవల తీర్పు చెప్పారు.

ఏసీబీ కోర్టు వేసిన శిక్ష రద్దు

ఉస్మానియా యూనివర్శిటీలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి 30 ఏండ్ల కింద నమోదైన కేసులో ఆరుగురికి ఏసీబీ కోర్టు విధించిన ఏడాది శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వాళ్లను నిర్ధోషులుగా ప్రకటించింది. ఓయూలో ఓవర్‌‌‌‌ టైమ్, ప్రింటింగ్‌‌‌‌ స్టేషనరీ, ప్రెస్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ కొనుగోళ్లలో రూ.1.59 కోట్ల దుర్వినియోగం జరిగిందని పేర్కొంటూ ఓయూ రిజిస్ట్రార్‌‌‌‌ 1993లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు.  

1994లో కేసు నమోదైంది. 11 మందిపై చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేసింది. ఆ కేసు విచారణలో ఉండగా కొందరు ఉద్యోగులు మృతి చెందారు. ఆరుగురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ 2007లో ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును నాటి సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ సయ్యన్‌‌‌‌అన్వర్, అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ వి సత్యనారాయణ, హరినారాయణ, సి బాలమల్లేశ్వరరావు, చంద్రశేఖర్, కె.ఎల్‌‌‌‌ రామారావు హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. అప్పీళ్లను ఆమోదిస్తూ, ఏసీబీ కోర్టు తీర్పును కొట్టేస్తూ జస్టిస్‌‌‌‌ కె.సురేందర్‌‌‌‌ ఇటీవల తీర్పు చెప్పారు.