
మాజీ ENC మురళీధర్ రావును 7 రోజుల కస్టడీకి కోరుతూ గురువారం ( జులై 17 ) ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. ఈ పిటిషన్ పై శుక్రవారం ( జులై 18 ) విచారణ జరపనుంది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్నారు మురళీధర్ రావు. ఏసీబీ సోదాల్లో మురళీధర్ రావుకి సంబంధించి భారీగా బినామీల పేర్లతో ఆస్తుల గుర్తించారు ఏసీబీ అధికారులు.
మురళీధర్ రావు ను కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని అక్రమ ఆస్తులు బయటికి వచ్చే అవకాశం ఉందని.. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన సమయంలోమురళీధర్ రావు భారీగా ఆస్తులు సంపాదించారని కోర్టుకు తెలిపారు ఏసీబీ అధికారులు.ఇదిలా ఉండగా.. మంగళవారం ( జులై 15 ) మాజీ ENC మురళీధర్ రావు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అధిక మొత్తంలో అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన అనేక స్థిరాస్తులు, విలువైన వస్తువులు బయటపడ్డాయి. అందులో ఒక విల్లా కొండాపూర్‌లో, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట్లో ఫ్లాట్లు ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లలో కమర్షియల్ బిల్డింగులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కోదాడలో ఒక అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో సోలార్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్‌మెంట్ ఉన్నట్టు బయటపడింది. దీనితో పాటు 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 4 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి ఉన్నట్టు తెలిసింది.