
- కొడుకు సాయి అభిషేక్‌తో కలిపి విచారించిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మురళీధర్ రావు కొడుకు సాయి అభిషేక్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్న అధికారులు.. ఏపీ, తమిళనాడులోనూ ఆస్తులు ఉన్నట్టు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. సాయి అభిషేక్ పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం 6 బ్యాంకు లాకర్లు ఉన్నట్టు గుర్తించగా.. వీటిలో 3 లాకర్లను ఓపెన్ చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో 3 లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. కోర్టు అనుమతితో మురళీధర్‌రావును 5 రోజులు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం మూడో రోజు మురళీధర్‌రావుతో పాటు ఆయన కొడుకు సాయి అభిషేక్‌ను ప్రశ్నించారు. ముందుగా ఇద్దరినీ విడివిడిగా, ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారు. 70 ఏండ్ల వృద్ధుడు కావడంతో మురళీధర్‌రావు ఆరోగ్యం పట్ల ఏసీబీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడ్రోజుల విచారణలో మురళీధర్ రావు సంపాదించిన ఆస్తుల వివరాలను సేకరించారు. ఇందులో ప్రధానంగా మురళీధర్‌రావు తన పేరు మీద కాకుండా కొడుకు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు అధికారులు గుర్తించారు.