మాజీ మంత్రి తలసానికి ఏసీబీ నోటీసులు!

మాజీ మంత్రి  తలసానికి ఏసీబీ నోటీసులు!

హైదరాబాద్: మాజీ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణను అవినీతి నిరోధక శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తలసాని ఓఎస్డీ కల్యాణ్‌ కుమార్‌ మసాబ్‌ ట్యాంక్‌లోని రాష్ట్ర పశుసంవర్థకశాఖ కార్యాలయానికి వెళ్లి కీలక ఫైళ్లను చించేసి, కాగితపు ముక్కలను బస్తాలో మూటగట్టుకొని తన కారులో వేసుకొని వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి, రూ.2.08 కోట్ల నిధులు బోగస్‌ ఖాతాల్లోకి దారి మళ్లడానికి సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కేసుల విచారణ బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. 

ఏం జరిగింది?

పశుసంవర్థక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కుమ్మక్కై నిధులను దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి.  రాష్ట్ర పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్‌, ఆదిత్య కేశవ్‌సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కలిసి గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలో పర్యటించారు. 18 మంది రైతుల నుంచి 133 యూనిట్ల కోసం 2,793 గొర్రెలు సేకరించారు. వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి రూ.2.08 కోట్లు మళ్లించారు. 

డబ్బులు రాకపోవటంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్‌ను నిలదీశారు. పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపు పూర్తయినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో కాంట్రాక్టర్‌ వెళ్లి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పశుసంవర్థక శాఖ ఏడీలు రవికుమార్‌, ఆదిత్య కేశవ్‌ సాయితోపాటు ఇద్దరు దళారులపై ఐపీసీ సెక్షన్లు- 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు కేసును ఏసీబీకి బదిలీ అయ్యింది. దీంతో మంత్రి తలసానికి కూడా నోటీసులు జారీ కావడం గమనార్హం.