కోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. అరెస్ట్ చేసిన ఏసీబీ !

కోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. అరెస్ట్ చేసిన ఏసీబీ !

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా విధుల్లో ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు మరో 5 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది. సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. కర్మన్‌ఘాట్‌లో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు.. విలువ రూ.2.63 కోట్లు. కర్మన్‌ఘాట్‌లో G+3 పెంట్‌హౌస్.. విలువ రూ.1.61 కోట్లు.

యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి. వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. సోదాల్లో రూ.4 లక్షల నగదు, బ్యాంక్‌లో రూ.8.60 లక్షల బ్యాలెన్స్, 680 గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఫోర్‌వీలర్లు, మూడు టూ వీలర్లు కలిపి 7 వాహనాలు. వాహనాల విలువ సుమారు రూ.59 లక్షలు. ఇంట్లోని రూ.11 లక్షల విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సీజ్ చేశారు.

బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు. శ్రీనివాస్‌రెడ్డి ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.6.87 కోట్లు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా. గతంలోనూ శ్రీనివాస్‌రెడ్డిపై 2009లో ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదైంది.

అప్పట్లో మహేశ్వరం మండలంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కేసు నమోదైంది. మరికొద్ది సేపట్లో శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ ఏసీబీ తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన రంగారెడ్డి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.