- తెల్లవారుజాము వరకు తనిఖీలు
- మున్సిపల్ కమిషనర్, మేనేజర్ ఇండ్లలోనూ సోదాలు
- ఉద్యోగుల ఫోన్లలో అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు
- రూ.22 కోట్ల పన్నుకు రూ.8 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు రిపోర్ట్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం సృష్టించాయి. సిబ్బంది ఫోన్లలో అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సోదాలు కొనసాగాయి.
2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కొండ్రు నరసింహ, మేనేజర్ శ్రీనివాస్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. బిల్ కలెక్టర్ నాగుబండి నరసింహారావు ఫోన్ లో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తో పాటు పలువురు సిబ్బందికి మధ్య అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి, ఫోన్సీజ్చేశారు.
పాతికేళ్లుగా తిష్టవేసి వసూళ్ల పర్వం..
మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న నరసింహారావు దాదాపు గత పాతికేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో సత్తుపల్లి మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరిన నరసింహారావు, ఆ తర్వాత మున్సిపాలిటీగా మారడంతో అక్కడే పాతుకుపోయారు. ఆయనపై ఫిర్యాదులు, ఆరోపణల కారణంగా పాలకవర్గాలు మారిన సమయంలో కొంత కాలం పక్కనబెట్టినా, ఏదో రకంగా మళ్లీ జాయిన్ అయ్యేవాడు. తాజాగా ఏసీబీ ఆకస్మిక తనిఖీల వెనుక కూడా ఈయనపై వచ్చిన కంప్లైంటే కారణమని సమాచారం. కాకర్లపల్లి రోడ్డులో కొత్తగా నిర్మించిన మూడు అంతస్తుల భవన యజమాని ఆన్ లైన్ లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగా రూ.75 వేల ఆస్తి పన్ను వచ్చింది.
దాన్ని తక్కువ చేసేందుకు నరసింహారావును కలవగా, మేనేజర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ మేనేజ్ చేయాలంటూ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ బిల్డింగ్ యజమాని బిల్ కలెక్టర్ నరసింహారావుకు రూ.లక్షన్నర క్యాష్ ఇచ్చి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు మున్సిపల్ ఆఫీస్ లో సోదాలకు వచ్చిన సమయంలో ఫీల్డ్ లో ఉన్న నరసింహారావుకు ఈ తనిఖీల విషయం తెలియడంతో భయపడి, బిల్డింగ్ యజమానికి రూ.లక్షన్నర తిరిగిచ్చినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని తర్వాత ఏసీబీ అధికారుల ఎంక్వైరీలో కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.
ఫైళ్లను చెక్ చేసి, ఫోన్ లను క్రాస్ చెక్ చేసి..!
18 మంది ఏసీబీ స్టాఫ్ 6 టీమ్లుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఒక్కో టీమ్ ఒక్కో విభాగంలోని ఫైళ్లను చెక్ చేస్తూ, మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఆస్తి పన్నులు, ఇతర ఫైళ్లు ఆమోదం పొందిన తేదీలను, మున్సిపల్ సిబ్బంది ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను, ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులను క్రాస్ చెక్ చేశారు. ఆ ఫైళ్లకు సంబంధించిన వ్యక్తులతో మున్సిపల్ సిబ్బంది ఎవరైనా ఫోన్ కాల్స్ మాట్లాడారా అని కూడా పరిశీలించారు. దీంతో సిబ్బంది మధ్య చాలా వరకు అనుమానాస్పద ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు బయటపడినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
సోదాలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. పూర్తి స్థాయిలో ఫైళ్ల తనిఖీ తర్వాత మరో రిపోర్ట్ అందించనున్నారు. ఇక మున్సిపాలిటీలో పన్నులు, ఇతర ఆదాయ వసూళ్ల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.22.23 కోట్లు పన్ను వసూళ్లు చేయాల్సి ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసిన్పటికీ కేవలం రూ.8 కోట్లు మాత్రమే వసూళ్లు చేశారంటూ నివేదికలో పేర్కొన్నారు.
ఫైళ్లను తనిఖీ చేస్తున్నాం
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో సోదాలు నిర్వహించాం. రికార్డుల మెయింటనెన్స్, రెవెన్యూ వసూళ్లలో అవకతవకలను గుర్తించాం. వాటిపై మరింత దర్యాప్తు చేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ చేసిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం.
ఏకాంబరం రమేష్, ఏసీబీ డీఎస్పీ, ఖమ్మం
