
రామచంద్రాపురం, వెలుగు: విద్యుత్ కాంట్రాక్టర్ ఇంటిపై ఏసీబీ రైడ్స్ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రాపురం పరిధిలోని మల్లికార్జున నగర్‌కాలనీలో ఉండే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సతీశ్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. హైదరాబాద్ మణికొండ విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ఏసీబీ పలు చోట్ల రైడ్స్ చేసింది.
ఇందులో భాగంగా ఎలక్ర్టికల్కాంట్రాక్టర్ సతీశ్ ఇంట్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఏడీఈ అంబేద్కర్ బినామీలు, బంధువుల ఇండ్లలో రైడ్స్ చేస్తుండగా.. సతీశ్ కూడా బినామీల లిస్టులో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది మంది ఏసీబీ సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు.
ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకపోవడంతో పూర్తి వివరాలు తెలియ రాలేదు. అర్ధరాత్రి వరకు ఏసీబీ రైడ్స్ జరిగే అవకాశం ఉందని, సతీశ్ ఇంట్లో లభ్యమైన పలు కీలక డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.