
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం (మే 13) హయత్ నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మరికొన్నిచోట్ల సోదాలు చేశారు. పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే.. డీఎస్పీ పార్థసారథి ఇంట్లో అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 65 యూస్డ్ బుల్లెట్స్‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇంట్లో అక్రమంగా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారి మురళి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ పార్థసారధిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్ధ సారధి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి..? ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి..? యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడవి..? వాటిని ఎక్కడ ఉపయోగించారు..? అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఓ మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో రూ.16 లక్షల చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. డీఎస్పీ పార్థసారధి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ విచారణలో డీఎస్పీ, సీఐ డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. దీంతో పార్థసారథి, సీఐ వీరరాఘవులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.