శివబాలకృష్ణ ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు

శివబాలకృష్ణ ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు

 

  • ఇంట్లో రూ.84 లక్షలకు పైగా నగదు
  • రెండు కిలోల బంగారం.. 15 లక్షల విలువైన వాచ్​లు
  • కోట్లు పలికే 75 ఎకరాల భూమి
  • ఖరీదైన ఫోన్లు, ల్యాప్​టాప్​లు, కారు సీజ్​
  • గతంలో హెచ్ఎండీఏ టౌన్​ ప్లానింగ్​ డైరెక్టర్​గా విధులు
  • ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు
  • ఏసీబీ జాయింట్​ డైరెక్టర్​ ఆధ్వర్యంలో 17 టీమ్స్ రెయిడ్స్​
  • అధికారుల అదుపులో నిందితుడు

హైదరాబాద్‌‌, వెలుగు:  రెరా సెక్రటరీ శివబాలకృష్ణ ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నది. హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం తెల్లవారుజాము నుంచి మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడలోని శివబాలకృష్ణ ఇల్లు, అమీర్‌‌‌‌పేట్‌‌లోని హెచ్‌‌ఎమ్‌‌డీఏ ఆఫీస్‌‌, ఆయన బంధువులు ఇళ్లలో 17 టీమ్స్‌‌తో సోదాలు మొదలుపెట్టింది. శివబాలకృష్ణ ఇంట్లో రూ.84 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. రూ.15 లక్షలు విలువ చేసే 40కి పైగా వాచ్‌‌లు, 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్‌‌ఫోన్స్‌‌, ల్యాప్​టాప్స్,​ గిఫ్ట్​ఆర్టికల్స్​స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారం, కోట్ల రూపాయలు ధర పలికే 75 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్నీ కలిపి దాదాపు రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి ఆస్తుల వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఏసీబీకి సహకరించని బాలకృష్ణ

శివబాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులకు సహకరించడంలేదని తెలిసింది. జాయింట్‌‌ డైరెక్టర్‌‌ ‌‌ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాల్లో అధికారులు వివిధ బ్యాంక్‌‌లకు చెందిన లాకర్స్‌‌ను గుర్తించారు. వాటిని కుటుంబ సభ్యులు, బ్యాంక్ సిబ్బంది సమక్షంలో గురువారం ఓపెన్ చేయనున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఆయన రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ ఉన్నట్లు గుర్తించారు.

హెచ్‌‌ఎండీఏ అడ్డాగా భారీ అవినీతి..! 

శివబాలకృష్ణ హెచ్‌‌ఎండీఏలో 2018 నుంచి గతేడాది వరకు  టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం రేరా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గతంలో మున్సిపల్‌‌అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేశాడు. ఆ  సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులతో కలిసి అవినీతి చేసినట్లు డిపార్ట్‌‌మెంట్‌‌లో ప్రచారం జరిగింది.‘ఛేంజ్‌‌ఆఫ్‌‌ ల్యాండ్‌‌ యూస్‌‌’  ప్రక్రియలో పెండింగ్ ఫైల్స్‌‌ను అక్రమంగా క్లియర్ చేశాడని, ఇందుకు భారీగా డబ్బుతో పాటు విలువైన భూములను కూడా తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 

రెరా సెక్రటరీగా రియల్‌‌ ఎస్టేట్‌‌ దందా..

రెరా సెక్రటరీగా శివబాలకృష్ణ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి సమాచారం అందినట్లు తెలిసింది.హెచ్‌‌ఎమ్‌‌డీఏ పరిధిలో రియల్ ఎస్టేట్‌‌కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా లాబీయింగ్‌‌ నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇప్పించడంలో బాలకృష్ణ కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. ఇందులో రూ.వందల కోట్లు అవినీతి జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. బినామీ పేర్లతో రియల్‌‌ఎస్టేట్‌‌వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే  పటిష్టమైన దర్యాప్తు చేస్తున్నది. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సోదాలు ముగిసిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని అధికారులు తెలిపారు.