శివ బాలకృష్ణ అవినీతి సొమ్ము రూ.400 కోట్ల పైనే!

శివ బాలకృష్ణ అవినీతి సొమ్ము రూ.400 కోట్ల పైనే!
  •     18 గంటల పాటు ఏసీబీ ఆఫీసర్ల సోదాలు
  •     రూ.100 కోట్లు నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి సీజ్
  •     రూ.8.26 కోట్లు విలువ చేసే సెల్‌‌ఫోన్లు, వాచ్‌‌లు కూడా..
  •     చంచల్‌‌గూడ జైలులో బాలకృష్ణ రిమాండ్

హైదరాబాద్‌‌, వెలుగు : హెచ్‌‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌‌ ‌‌శివ బాలకృష్ణ అక్రమాల డొంక కదులుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అవినీతితో పోగేసిన నోట్ల కట్టలు, రూ.వందల కోట్ల భూముల లెక్కలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. 15 ఏండ్లుగా బాలకృష్ణ సంపాదించిన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 18 గంటల పాటు జరిపిన సోదాల్లో రూ.400 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదులతో రెరా సెక్రటరీ, హెచ్‌‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌‌‌‌ శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రారంభమైన సోదాలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో రూ.100 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, 100 ఎకరాలకు పైగా ల్యాండ్‌‌ డాక్యుమెంట్లను సీజ్‌‌ చేశారు. బాలకృష్ణను గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌‌ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాలకృష్ణను చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌కు తరలించారు.

పెద్ద ఎత్తున ఫిర్యాదులు

రామంతపూర్ వెంకటరెడ్డి నగర్‌‌‌‌కు చెందిన శివబాలకృష్ణ.. అనంతపురంలో 1994లో అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌‌ ఆఫీసర్‌‌‌‌గా విధుల్లో చేరాడు. 2009 ఫిబ్రవరిలో జీహెచ్‌‌ఎంసీలో అడిషనల్‌‌ టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం రెరా సెక్రటరీగా, హైదరాబాద్‌‌ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్‌‌‌‌గా కొనసాగుతున్నాడు. హెచ్‌‌ఎండీఏలో పని చేస్తున్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. నగదు, భూములను పెద్ద ఎత్తున సంపాదించాడని ఏసీబీకి ఫిర్యాదు వెళ్లాయి. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం నుంచి మొత్తం 17 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 కోట్ల నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వాచెస్‌‌, ల్యాప్‌‌టాప్స్‌‌, సెల్‌‌ఫోన్స్‌‌, గిఫ్ట్‌‌ ఆర్టికల్స్‌‌ సీజ్‌‌ చేశారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ 8.26 కోట్లు ఉంటాయని అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌‌ సహా హెచ్‌‌ఎండీఏ విస్తరించిన జిల్లాల్లోని భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌‌లో వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని ఏసీబీ అధికారులు తెలిపారు. డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతున్నదని వెల్లడించారు.

100 ఎకరాలకు పైగా భూములు

హైదరాబాద్‌‌ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రియల్ ఎస్టేట్‌‌లో బాలకృష్ణ భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24, యాదాద్రిలో 23, కొడకండ్లలో 17 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల పేర్లపై ఇవన్నీ ఉన్నట్లు గుర్తించారు. వివిధ జిల్లాల్లో కూడబెట్టిన ఆస్తులు, ల్యాండ్ డాక్యుమెంట్లను సేకరించారు. మొత్తం100ఎకరాలకు పైగా భూములు, ఖరీదైన విల్లాలు, ఫామ్‌‌హౌస్‌‌ల డాక్యుమెంట్లను సీజ్‌‌ చేశారు. వీటి విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్లలో ఉన్న బినామీల వివరాలను సేకరిస్తున్నారు.