
హైదరాబాద్,వెలుగు: ఇరిగేషన్ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) చీటి మురళీధర్‌రావు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు అనుమతితో ఆయనను బుధవారం కస్టడీలోకి తీసుకుంది. ఏసీబీ విజ్ఞప్తి మేరకు బుధవారం నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఐదురోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నాంపల్లిలోని సిటీ రేంజ్ ఏసీబీ ఆఫీసుకి మురళీధర్‌రావును ఏసీబీ తరలించింది.
మొదటిరోజు విచారణలో భాగంగా వృత్తిగత జీవితానికి సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. వ్యక్తిగత, కుటుంబ విషయాలతోపాటు వేతనం ద్వారా ఆయన సంపాదన.. ప్రధాన ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోదాల్లో భాగంగా గుర్తించిన పలు ఆస్తుల వివరాలకు సంబంధించి ప్రాథమిక వివరాలను సేకరించారు. ఇరిగేషన్ శాఖలో మురళీధర్‌రావు చేరిన నాటి నుంచి ఈఎన్సీగా పదోన్నతులకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.