కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు
  •     కీసరలో రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్​
  •     వేములవాడలో రూ.8 వేలు తీసుకుంటూ దొరికిన తహసీల్దార్

కీసర, వేములవాడ రూరల్: కీసర తహసీల్దార్ కార్యాలయంలో వారసత్వ పట్టా మార్పిడి కోసం రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ రెడ్డి, రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణను ఏసీబీ అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో రూ.8 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్‌‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ వివరాల ప్రకారం.. ఇటీవల కీసరకు చెందిన పన్నాల బుచ్చి రెడ్డి, పన్నాల సుశీల దంపతులు మృతి చెందడంతో వారి కొడుకు పన్నాల గిరిధర్ రెడ్డి తన తల్లి పేరు మీద ఉన్న సర్వే నంబర్‌‌ 183, 184 లోని 3- ఎకరాల భూమిని వారసత్వ పట్టా మార్పిడి కోసం సంబంధిత కార్యాలయానికి వెళ్లాడు. 

అయితే, ఈ భూమి 22A లో ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని కీసర డిప్యూటీ తహసీల్దార్‌‌ సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు. 22A లో నుంచి తీయాలంటే తహసీల్దార్‌‌ కు, ఆర్డీవో ఆఫీస్‌‌లో సైతం డబ్బులు ఇవ్వాలని ఆయన చెప్పారు.  ఈ నేపథ్యంలో పన్నాల గిరిధర్ రెడ్డి మొదటగా రూ.2.50 లక్షలను ఎంఆర్‌‌వో కార్యాలయంలో విజయ్ కుమార్‌‌ రెడ్డికి అందజేశాడు. ఆ నగదును విజయ్ కుమార్ రికార్డు అసిస్టెంట్‌‌ బాలకృష్ణకు ఇచ్చాడు. అతడు.. ఆ నగదును డిప్యూటీ తహసీల్దార్‌‌ సందీప్ రెడ్డి గదిలోకి తీసుకెళ్లి అతడి బ్యాగ్‌‌లో పెడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

వేములవాడ రూరల్‌‌లో తహసీల్దార్‌‌..
కరీంనగర్‌‌ రేంజ్‌‌ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్‌‌ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన అత్తకు చెందిన వ్యవసాయ భూమిని తండ్రి పేరిట గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని చేసి పెట్టేందుకు వేములవాడ రూరల్ తహసీల్దార్‌‌ మహమ్మద్ అబూబాకర్ రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం వేములవాడ రూరల్ తహసీల్దార్‌‌ కార్యాలయంలో ప్రైవేట్ ఆపరేటర్ అనిల్ కుమార్ ద్వారా తహసీల్దార్‌‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. నిందితులు ఇద్దరినీ కరీంనగర్‌‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.