బజార్ హత్నూర్, వెలుగు : ఓ రైతు నుంచి లంచం తీసుకున్న ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ తహసీల్దార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్‌రెడ్డిని శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గొర్ర మధు తెలిపిన వివరాల ప్రకారం.. బలాన్‌పూర్ శివారులోని సర్వే నంబర్ 11/ఏలో ఉన్న 8.35 ఎకరాల వ్యవసాయ భూమి సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం రైతు సీనియర్ అసిస్టెంట్ కట్కం విద్యాసాగర్‌రెడ్డిని కలిశాడు.
దీంతో పని పూర్తి కావాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని సదరు ఉద్యోగి డిమాండ్ చేయడంతో రైతులు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారు ఇచ్చిన సూచనతో శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్‌రెడ్డిని కలిసి రూ. 2 లక్షలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని, సీనియర్ అసిస్టెంట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.
