ఇన్సూరెన్స్‌‌ ఇప్పించేందుకు లంచండిమాండ్‌‌... ఏసీబీకి చిక్కిన మధిర అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్

ఇన్సూరెన్స్‌‌ ఇప్పించేందుకు లంచండిమాండ్‌‌... ఏసీబీకి చిక్కిన మధిర అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్
  • రూ. 15 వేలు తీసుకుంటూ చిక్కిన మధిర అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

మధిర, వెలుగు : చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడి ఫ్యామిలీకి రావాల్సిన ఇన్సూరెన్స్‌‌ డబ్బులు ఇప్పించేందుకు లంచం తీసుకున్న మధిర అసిస్టెంట్‌‌ లేబర్‌‌ ఆఫీసర్‌‌ను సోమవారం ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. మధిర పట్టణానికి  చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు 2024లో సహజంగా మరణించాడు. 

అతడి పేరున రూ. 1.30 లక్షల ఇన్సూరెన్స్‌‌ రావాల్సి ఉండడంతో కార్మికుడి కుటుంబ సభ్యులు మధిర అసిస్టెంట్‌‌ లేబర్‌‌ ఆఫీసర్‌‌ కె.చందర్‌‌ను కలిశారు. చనిపోయిన కార్మికుడి వివరాలు, సర్టిఫికెట్లకు సంబంధించిన ఫైల్‌‌ను ఫార్వార్డ్‌‌ చేసేందుకు సదకు లేబర్‌‌ ఆఫీసర్‌‌ రూ. 30 వేలు డిమాండ్‌‌ చేశాడు. అంత ఇచ్చుకోలేమని మృతుడి కుటుంబసభ్యులు చెప్పడంతో రూ. 15 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత కార్మికుడి కుటుంబ సభ్యులు ఏసీబీకి సమాచారం ఇచ్చారు. 

అనంతరం డబ్బులు ఇచ్చేందుకు మృతుడి భార్య లేబర్‌‌ ఆఫీసర్‌‌ను సంప్రదించడంతో వైరా రోడ్‌‌లోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీ సమీపంలో ఉన్న టీస్టాల్‌‌ వద్దకు రావాలని సూచించాడు. దీంతో ఆమె టీ స్టాల్‌‌ వద్దకు వెళ్లి ఆఫీసర్‌‌ చందర్‌‌కు రూ. 15వేలు ఇచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌‌, తన సిబ్బందితో కలిసి అసిస్టెంట్‌‌ లేబర్‌‌ ఆఫీసర్‌‌ చందర్‌‌ను రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు.