- ఎకరాకు రూ.లక్ష చొప్పున డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లాలో మరో అవినీతి తిమింగలం దొరికింది. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో శామీర్‌పేట్ తహసీల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.
ఆలియాబాద్ గ్రామంలోని 30 ఎకరాల భూమికి ‘నాలా’ (భూమార్పిడి) కన్వర్షన్ అనుమతులు ఇవ్వడం కోసం తహసీల్దార్ సుచరిత ఎకరాకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం.. మంగళవారం తహసీల్దార్ ప్రైవేట్ డ్రైవర్ నాగరాజు అలియాస్ నగేశ్‌కు బాధితులు రూ.2 లక్షల అడ్వాన్స్ నగదు అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రైవర్ ద్వారా లంచం స్వీకరిస్తున్న వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. తహసీల్దార్ సుచరితను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో కీసర ఆర్డీవో రాజేశ్‌ను కూడా విచారించారు. అనంతరం ఏ1గా తహసీల్దార్ సుచరితను, ఏ2గా డ్రైవర్ నగేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
మూడేండ్లలో ఇద్దరు ఎమ్మార్వోలు ఔట్
శామీర్‌పేట్ రెవెన్యూ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. ఇక్కడ మూడేండ్ల వ్యవధిలోనే ఇద్దరు తహసీల్దార్లు ఏసీబీకి దొరికారు. 2024లో అప్పటి ఎమ్మార్వో సత్యనారాయణ తన డ్రైవర్ ద్వారా రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.
ఆ తర్వాత ఇక్కడికి రావడానికి అధికారులు భయపడటంతో రెండు నెలలు డిప్యూటీ ఎమ్మార్వో సంయుక్త ఇన్‌చార్జీగా, ఆ తర్వాత యాదగిరి రెడ్డి ఏడాదిన్నర పాటు తహసీల్దార్‌గా పనిచేశారు. తాజాగా 2026లో బాధ్యతలు చేపట్టిన సుచరిత కూడా రూ.30 లక్షల లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కడంతో శామీర్‌పేట్ రెవెన్యూ ఆఫీస్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
