- ఏసీబీకి పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగ జ్యోతి
హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) కె. జగ జ్యోతి ఏసీబీ వలలో చిక్కింది. బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఆఫీస్‌లో జగజ్యోతి ఇంచార్జి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నామ్‌దేవ్‌వాడకు చెందిన కాంట్రాక్టర్ బొడుకం గంగన్న డిపార్ట్‌మెంట్‌లో కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్ చేస్తుండేవాడు. ఆయన గాజులరామారంలోని జువెనల్ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు చేయించాడు. ఇందుకు సంబంధించిన బిల్స్ జగజ్యోతి ఆఫీస్‌లో దాఖలు చేశాడు. బిల్స్ సాంక్షన్ చేయించుకునేందుకు జగ జ్యోతిని కలిశాడు. దీంతో పెండింగ్ బిల్స్ క్లియర్ చేసేందుకు జగ జ్యోతి రూ.84 వేల లంచం డిమాండ్ చేసింది.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు కేసు నమోదు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. మాసబ్ ట్యాంక్‌లోని జగ జ్యోతి ఆఫీస్ ఛాంబర్‌లో లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు.
