
- ఫైల్స్ తీసుకెళ్తున్నారని వైస్ చాన్స్‌లర్ కారును వెంబడించిన ఆఫీసర్లు
- భిక్కనూర్ టోల్ గేట్ దగ్గర ఆపి సోదాలు
- విచారణ పేరిట తెలంగాణ యూనివర్సిటీలో రోజంతా హైడ్రామా
- నా దగ్గర ఆఫీస్ ఫైళ్లు దొరకలే : వీసీ రవీందర్ గుప్తా
నిజామాబాద్/డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఏసీబీ, విజిలెన్స్ అండ్ టాస్క్ఫోర్సు అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అదే టైంలో వీసీ రవీందర్ గుప్తా తన మనుషులతో ఛాంబర్ నుంచి కీలక ఫైల్స్ తెప్పించుకొని కారులో వెళుతున్నారని ప్రచారం జరగడంతో ఆఫీసర్లు వెంబడించారు. డిచ్పల్లి ఎస్ఐ గణేశ్ వారికి ఎస్కార్ట్‌గా వెళ్లారు. కారును ఛేజ్ చేసి కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ టోల్గేట్ వద్ద ఆపి ఆయన దగ్గర ఉన్న ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఒకదశలో వీసీని అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. మొత్తం మీద రోజంతా హైడ్రామా నడవడంతో అటు వర్సిటీలోనూ, విద్యాశాఖ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మూడు కార్లలో రయ్‌మంటూ...
మధ్నాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు కార్లలో హైదరాబాద్ నుంచి 15 మంది ఆఫీసర్లు వచ్చారు. వారిలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. వీసీ రవీందర్ వారికంటే ముందే తన ఛాంబర్‌కు వచ్చి గెస్ట్‌హౌస్ వెళ్లారు. తనిఖీల సమాచారం తెలిసి తన వ్యక్తిగత సిబ్బందిని పురమాయించడం ద్వారా కొన్ని ఫైల్స్ తెప్పించుకొని కారులో వెళ్లారు. విషయం పసిగట్టిన ఏసీబీ టీంలోని ముగ్గురు ఆఫీసర్లు ఆయన కారును 60 కిలోమీటర్ల వరకు వెంబడించారు. అప్పటికే వీసీ కారు ఇందల్వాయి టోల్గేట్ దాటడంతో మరి కొద్ది దూరంలోని భిక్కనూర్ టోల్గేట్ వద్ద ఆపడానికి అక్కడి పోలీసుల సహాయం తీసుకున్నారు.
3 గంటల విచారణ
వీసీ రవీందర్‌గుప్తా కారును భిక్కనూర్ టోల్గేట్ వద్ద ఆపేయించిన తర్వాత అక్కడికి చేరుకున్న అధికారులు ఆయన్ను అక్కడే సుమారు 3 గంటలు ప్రశ్నించినట్టు సమాచారం. ఆయన బ్యాగులోని ఫైల్స్ పరిశీలించినట్టు తెలిసింది. వీసీ వెంట కారులో ఆయన పీఏ కూడా ఉన్నారని ఆయన్ను కూడా ప్రశ్నించినట్టు సమాచారం. టోల్గేట్ నుంచి వీసీని విచారణ అధికారులు
హైదరాబాద్ తీసుకెళ్లారనే ప్రచారం జరిగింది.
క్షుణ్ణంగా రికార్డుల చెకింగ్
మధ్యాహ్నం వచ్చింది మొదలుకొని సాయంత్రం పొద్దుపోయేదాకా ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు వర్సిటీలోని ప్రతి ఫైల్‌ను పరిశీలించారు. కంప్యూటర్ సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీకి అనుబంధంగా నడిస్తున్న బ్యాంకుకు వెళ్లి నగదు లావాదేవీల ప్రింటెడ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకొని బుధవారం కూడా విచారణ కొనసాగించనున్నారు. దీనికి మీడియాను అనుమతించడంలేదు.
ఆఫీస్ ఫైళ్లు లేవు : వీసీ రవీందర్‌గుప్తా
తాను ఆఫీసు ఫైళ్లు తీసుకొని వెళ్లినట్టు అనుమానించి అధికారులు భిక్కనూర్ టోల్గేట్ వద్ద ఆపింది నిజమేనని వీసీ రవీందర్‌గుప్తా వెలుగుతో అన్నారు. కీలక ఫైల్స్ వర్సిటీలోనే ఉన్నాయన్నారు. తన బ్యాగు పరిశీలించగా రిజిస్ర్టార్లుగా నిర్మలాదేవీ, కనకయ్యను తాను అపాయింట్ చేసిన ఆర్డర్లు, కోర్టు కాగితాలు వారికి లభించాయన్నారు. వాటి ఫొటోలు తీసుకొని కొన్ని ప్రశ్నలు వేశారన్నారు. గురువారం తాను వర్సిటీకి వస్తానని ఎంక్వైరీ ఆఫీసర్లకు చెప్పానన్నారు. అప్పటిదాకా వారికి సహకరించడానికి తాను రిజిస్ట్రార్‌గా నియమించిన కనకయ్య, అకౌంట్స్ ఆఫీసర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉంటారన్నారు. విచారణ పట్ల తనకు భయం లేదని చెప్పారు. రూల్స్ పరిధిలోనే ప్రతి పని చేశానన్నారు. ఈసీ కమిటీకి చైర్మన్ హోదాలోని తనపై సభ్యులు కంప్లైంట్ చేయడం బాధాకరమన్నారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వల్లే సమస్య తలెత్తిందన్నారు. రూ.30 కోట్ల ఫండ్ విడుదల చేయకుండా ఆపేసి కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారన్నారు.