మంచిర్యాల జిల్లాలో అక్రమాల అంతస్తులు

మంచిర్యాల జిల్లాలో అక్రమాల అంతస్తులు
  •     మున్సిపాలిటీల్లో రూల్స్​కు విరుద్ధంగా కట్టడాలు 
  •     టీఎస్ బీపాస్ పర్మిషన్ ఒకలా.. బిల్డింగులు కట్టేది మరోలా
  •     సెల్లార్లు, సెట్​బ్యాక్ లేకుండానే నిర్మాణాలు 
  •     పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ఆఫీసర్లు
  •     కట్టడాల వైపు తొంగిచూడని టౌన్ ప్లానింగ్ అధికారులు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో రూల్స్​కు విరుద్ధంగా ఓ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మిస్తుండగా గురువారం ప్రమాదం జరిగింది. సెట్​బ్యాక్ లేకుండా కాంపౌండ్ వాల్ కోసం పది ఫీట్ల లోతు గుంత తవ్వడంతో పక్కనున్న బిల్డింగ్ గోడ కూలిపోయి ముగ్గురు కూలీలు చనిపోయారు. వాస్తవానికి ఈ బిల్డింగ్​కు స్టిల్ట్​తో పాటు జీ+3 పర్మిషన్ తీసుకున్నారు. కానీ రూల్స్​కు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం చేపట్టారు. పనులు జరుగుతున్న టైమ్​లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మూడు నిండుప్రాణాలు బలయ్యాయి.

లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్​ను ఆదేశించారు. ఇలా మంచిర్యాలతో పాటు జిల్లాలోని మిగతా ఆరు మున్సిపాలిటీల్లో రూల్స్​ను ఉల్లంఘించి బిల్డింగులు కడుతున్నారు. మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప.. ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షించడం లేదు. దీంతో భవన నిర్మాణదారులు, బిల్డర్లు యథేచ్ఛగా రూల్స్​ను ఉల్లంఘిస్తున్నారు. 

బిల్డింగ్​ ప్లాన్​కు విరుద్ధంగా..

మున్సిపాలిటీల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగులు నిర్మించాలంటే ముందుగా టీఎస్ బీపాస్ ద్వారా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. నిర్మాణదారులు అవసరమైన డాక్యుమెంట్లు, బిల్డింగ్ ప్లాన్​తో సెల్ఫ్ అసెస్​మెంట్ సమర్పించడంతో పాటు నిర్ణీత ఫీజు చెల్లించాలి. కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసినప్పటి నుంచి 21 రోజుల్లోగా మున్సిపల్ అధికారులు పరిశీలించి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గడువు దాటితే పర్మిషన్ ఇచ్చినట్టుగా భావించి నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. అయితే టీఎస్ బీపాస్ దరఖాస్తులో రూల్స్ ప్రకారం ఒక ప్లాన్ చూపించి దానికి విరుద్ధంగా నిర్మాణాలు జరుపుతున్నారు.

రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని అపార్ట్​మెంట్లు, కమర్షియల్ బిల్డింగులు కడుతున్నారు. రెండు మూడు ఫ్లోర్లకు పర్మిషన్ ఉంటే మూడు నాలుగు అంతస్తులు వేస్తున్నారు. 500 చదరపు మీటర్లకు తక్కువ విస్తీర్ణంలో సెల్లార్లకు పర్మిషన్ లేకున్నా ఇష్టారీతిన నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలాన్ని బట్టి నాలుగు వైపులా సెట్​బ్యాక్ వదలాల్సి ఉండగా, ఎక్కడా అది కనిపించడం లేదు. పార్కింగ్ ఏరియాకు స్థలం వదలడం లేదు. ఇంకుడుగుంతలు నిర్మించడం లేదు.

ఇష్టారీతిన నిర్మాణాలు

మున్సిపాలిటీల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగులను రూల్స్​కు విరుద్దంగా ఇష్టారీతిని నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. జిల్లా కేంద్రంతో పాటు మిగతా టౌన్లలోని హాస్పిటళ్లు, హోటళ్లు, లాడ్జీలు, షాపింగ్ కాంప్లెక్స్​లకు ఎక్కడా సెట్ బ్యాక్ గానీ, పార్కింగ్ ఏరియా గానీ కనిపించడం లేదు. పర్మిషన్ లేకున్నా సెల్లార్లు నిర్మించడమే కాకుండా వాటిలో షెట్టర్లు వేస్తున్నారు. చాలా హాస్పిటళ్లలో సెల్లార్లలో క్యాజువాలిటీలు, ల్యాబ్ లు, ఎక్స్​రే, స్కానింగ్ సెంటర్లు

మెడికల్ షాపులు కనిపిస్తున్నాయి. సెట్​బ్యాక్ లేకపోవడంతో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బిల్డింగుల చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి ఉండడం లేదు. పార్కింగ్ ఏరియా లేకపోవడంతో రోడ్లపైనే వెహికల్స్ నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. నస్పూర్​లో కలెక్టరేట్ రోడ్ ఎదురుగా ఉన్న ఓ ఫోర్ వీలర్ షోరూమ్​కు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్​గా వాడుతున్నారు.

మంచిర్యాల జన్మభూమినగర్​లో, ఐబీ చౌరస్తా వద్ద, బస్టాండ్ ఎదురుగా భారీ హంగులతో ఏర్పాటు చేసిన హాస్పిటల్ బిల్డింగులు రూల్స్ ప్రకారం లేవు. జిల్లా కేంద్రంలోని అన్ని హాస్పిటళ్లు దాదాపు ఇలాగే ఉన్నా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు ఎలా పర్మిషన్ ఇచ్చారో వారికే తెలియాలి. బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఓ కొత్తగా హోటల్​తో పాటు లాడ్జీలు, షాపింగ్ కాంప్లెక్స్​లు నిబంధనలకు విరుద్ధంగానే వెలిశాయి. గ్రీన్​సిటీ వెంచర్​లో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని అపార్ట్​మెంట్ కట్టినా అడిగేవారు లేరు. 

పట్టించుకోని అధికారులు.. పర్యవేక్షణ శూన్యం

టీఎస్ బీపాస్​లో వచ్చిన దరఖాస్తులు రూల్స్ ప్రకారం ఉన్నాయా, లేదా పరిశీలించి పర్మిషన్లు ఇవ్వాల్సిన మున్సిపల్ అధికారులు అదేమీ పట్టించుకోవడం లేదు. బిల్డింగ్ సైజును బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష దాకా లంచాలు తీసుకొని పర్మిషన్లు జారీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్ టీమ్​లకు ఫిర్యాదులు వస్తే స్పందించడం లేదు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్, క్యాతనపల్లి, చెన్నూర్

లక్సెట్టిపేట ఏడు మున్సిపాలిటీల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి అక్రమ కట్టడాలవైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. అలాగే మున్సిపాలిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల పర్యవేక్షణ గాలికొదిలేశారు. మంచిర్యాల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నిజామాబాద్​కు డిప్యూటేషన్​పై వెళ్లారు. మరో ఇద్దరు టీపీఎస్​లు ఉన్నా వారికి నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల అదనపు బాధ్యతలు అప్పగించారు. 

యజమానులు, బిల్డర్లపై కేసులు పెట్టొచ్చు

ఇటీవల ఖమ్మం కార్పొరేషన్​లో రూల్స్​కు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మించడంతో మున్సిపల్ కమిషనర్ ఆదర్శి సురభి కొరడా ఝుళిపించారు. బిల్డింగ్ యజమానులతో పాటు బిల్డర్​పైన, ప్లానింగ్ ఇచ్చిన లైసెన్స్​డ్ పర్సన్​పైనా పోలీసులకు కంప్లయింట్ చేశారు. టీఎస్ బీపాస్​లో జీ+1కు పర్మిషన్ తీసుకొని జీ+2 నిర్మించారు. నిర్ణీత సెట్​బ్యాక్ వదిలిపెట్టలేదు. దీంతో పోలీసులు ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు ఫైల్ చేశారు.

ఇలా రూల్స్ ఉల్లంఘించి నిర్మాణాలు చేసిన యజమానులపై, బిల్డర్లపై కేసులు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. బిల్డింగులను కూల్చేసే అధికారం ఉన్నా స్పందించడం లేదు. ఇలా అధికారులే అక్రమ కట్టడాలకు ఊతమిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.