మేడారంలో లారీలతో ప్రమాదాలు, ట్రాఫిక్​జామ్​

మేడారంలో లారీలతో ప్రమాదాలు, ట్రాఫిక్​జామ్​
  • మేడారంలో లారీలతో ప్రమాదాలు, ట్రాఫిక్​జామ్​
  • రోజురోజుకు     పెరుగుతున్న  భక్తుల రద్దీ
  • ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టని ఆఫీసర్లు

ములుగు, వెలుగు: మహా జాతర షురూ కాకముందే భక్తులంతా మేడారం బాట పట్టారు. నిత్యం వేలు, లక్షల సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జాతరకు వచ్చే భక్తులను ఇసుక లారీలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లోని  క్వారీల నుంచి ములుగు జిల్లా కేంద్రం మీదుగా వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్​లోడ్​తో ఉంటున్న ఇసుక లారీలు ఫుల్​స్పీడ్​తో వెళ్తున్నాయి. ఎదురుగా వచ్చే వెహికల్స్​కు కనీసం ఇండికేషన్స్​కూడా ఇవ్వడం లేదు. దీంతో జాతరకొచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 

వరుస ప్రమాదాలతో ఆందోళన

మేడారం మహాజాతర ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనుంది. ఇప్పటికే భక్తులు భారీగా తరలి వస్తుండడంతో రోడ్లపై వెహికల్స్​రద్దీ పెరిగింది. ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్​జామ్​సమస్య మరింత ఎక్కువవుతోంది. చాలామంది ఇసుక లారీల డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతూ ఇతర వెహికల్స్​ను ఓవర్​టేక్​చేస్తున్నారు. మూల మలుపుల వద్ద కూడా ఫుల్​స్పీడ్​తో వెళుతుండడంతో అంతా భయాందోళన చెందుతున్నారు. వెంటనే ఇసుక లారీలను బంద్​ చేయాలని ములుగు జిల్లా ప్రజలతోపాటు భక్తులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్​దృష్టికి కూడా పలువురు ఈ విషయాన్ని తీసుకెళ్లగా టీఎస్​ఎండీసీ ఆఫీసర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ములుగు-– పస్రా, పస్రా –  తాడ్వాయి, తాడ్వాయి – ఏటూరునాగారం రూట్లతోపాటు ములుగు – వరంగల్​రూట్​లో ఇసుక లారీలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో ఇసుక లారీలతో జరిగిన ప్రమాదాల్లో ఇటీవల నలుగురు చనిపోయారు. డిసెంబర్​లో చల్వాయి, గోవిందరావుపేట గ్రామాల మధ్య రోడ్డుపై ఆపిన ఇసుక లారీని వ్యాన్​ఢీకొనడంతో మణుగూరు ప్రాంతానికి చెందిన మిర్చి రైతులు ఇద్దరు చనిపోయారు. రాఘవపట్నం వద్ద బైక్​ను ఇసుక లారీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని మసీదు సెంటర్​వద్ద రోడ్డు దాటుతున్న శ్రీనివాస్​అనే స్థానికుడిని ఇసుక లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. శనివారం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద నెక్కొండకు చెందిన ఓ కుటుంబం ఆటోలో ఏటూరునాగారం నుంచి సొంతూరుకు వెళ్తుండగా వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల పస్రా – తాడ్వాయి మధ్య నేషనల్​హైవేపై ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. 

లారీలను కట్టడి చేయాలి

మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. లారీలు ఇష్టం వచ్చినట్లు వెళుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే కలెక్టర్​ప్రత్యేక చొరవ తీసుకొని లారీలను నియంత్రించాలి. లేదంటే డైవర్ట్​ చేయాలి. - సీతక్క, ఎమ్మెల్యే, ములుగు