బిలియనీర్ల  సంపద డబుల్​..

బిలియనీర్ల  సంపద డబుల్​..
  • పేదలపై కాదు.. పెద్దోళ్లపై పన్నులు వసూలు చేయాలని కోరుకుంటున్న జనం
  • బలమైన సోషల్​ సెక్యూరిటీ స్కీమ్​ తేవాలి
  • ఆరోగ్యం, పెన్షన్​ కోసం ఎక్కువ ఖర్చు చేయాలి
  • వెల్లడించిన ఫియా సర్వే

న్యూఢిల్లీ: కరోనా కాలంలో బాగా సంపాదించిన ఇండివిజువల్స్​పై, కంపెనీలపై ఎక్కువ పన్ను వేయాలని జనం కోరుకుంటున్నట్టు ఫైట్​ ఇనీక్వాలిటీ అలయన్స్​ ఇండియా (ఫియా ఇండియా) చేసిన సర్వే పేర్కొంది. ఇది తయారు చేసిన రిపోర్టు ప్రకారం.. సంవత్సరానికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిపై ప్రభుత్వం 2శాతం కోవిడ్–-19 సర్‌‌‌‌ఛార్జ్ విధించాలని 84 శాతం మంది కోరుతున్నారు.  మహమ్మారి సమయంలో భారీ లాభాలు సంపాదించిన సంస్థలపై తాత్కాలిక పన్ను విధించాలని 89.3శాతం మంది సూచించారు. 2022–-23 కేంద్ర బడ్జెట్‌‌‌‌ నేపథ్యంలో ప్రభుత్వం నుండి సామాన్యుడు ఏం కోరుకుంటాడో తెలుసుకోవడానికి ఫియా 24 రాష్ట్రాల నుండి 3,231 మందితో మాట్లాడింది.  యూనివర్సల్​ సెక్యూరిటీ స్కీమ్​  తేవాలని, రైట్​ టూ హెల్త్ కోసం​, లింగ ఆధారిత హింసను నిరోధించడానికి బడ్జెట్‌‌‌‌ను పెంచాలని 90శాతం కంటే ఎక్కువ మంది  డిమాండ్ చేశారని ఎన్‌జీఓలు, పౌర సమాజం, ట్రేడ్​ యూనియన్స్​, సోషల్​ మూవ్​మెంట్స్​ సంఘాలతో కూడిన ఫియా ఇండియా సర్వే వెల్లడించింది.  

కరోనా సమయంలో ఇండియా బిలియనీర్ల సంపద దాదాపు రెట్టింపు కాగా, 4.6 కోట్ల మంది జనం కఠిన పేదరికంలోకి వెళ్లారు. ఈ సంఖ్య ప్రపంచంలో సగం మంది పేదలకు సమానమని ఫియా నిర్వహించిన గ్లోబల్​ స్టడీ పేర్కొంది. మనదేశంలోని 98 మంది బిలియనీర్ల సంపద ఇండియాలోని 40 శాతం జనాభా ఆదాయానికి సమానం. కరోనా కారణంగా ఆర్థిక, సామాజిక అసమానతలు ఎక్కువయ్యాయి. సెకండ్​ వేవ్​ సమయంలో దాదాపు కోటి మంది జాబ్స్​కు దూరమయ్యారు. దాదాపు 97 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. ఇండియన్​ బిలియనీర్ల ఆస్తుల విలువ మాత్రం రెట్టింపు అయిందని  ఆక్సఫామ్​ ఇండియా రిపోర్టు వెల్లడించింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా, జీవిత బీమా ప్రయోజనాలు అందించడంతోపాటు ,అసంఘటిత కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని 94.3 శాతం మంది రెస్పాండెంట్లు కోరారు. షెడ్యూల్డ్ కులాలకు,  షెడ్యూల్ తెగలకు (ఎస్సీ,ఎస్టీలు) ఈ ప్రయోజనాలను ఇవ్వాలని 97 శాతం మందికిపైగా చెప్పారు.  పర్యావరణాన్ని కాపాడటానికి పెట్టిన రూల్స్​ను పట్టించుకోని కంపెనీలకు ఫైన్​ వేయాలని 89 శాతం మంది సూచించారు. రైట్​ టూ హెల్త్​ కార్యక్రమాన్ని తీసుకురావాలని 94.4 శాతం మంది రెస్పాడెంట్లు కోరారు.

కరోనా వల్ల ఏర్పడ్డ అసమానతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకోవచ్చు.  ఈ సమస్యలపై ప్రపంచమంతటా పోరాటాలు జరుగుతుతున్నాయి. ధనికులు తమ సంపద నుంచి కొంత సమాజానికి ఇవ్వాలి. జనం నాడిని ప్రభుత్వం తెలుసుకోవాలి. సోషల్​ సెక్యూరిటీ, హెల్త్​ కోసం, పేదలకు మంచి జీవితం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి’’
-ఏంజెలా తనేజా, లీడ్​, ఫియా ఇండియా