సీఎం చెప్పినా సమగ్ర శిక్ష అభియాన్​లో జీతాలు పెరగలే

సీఎం చెప్పినా సమగ్ర శిక్ష అభియాన్​లో జీతాలు పెరగలే
  • ప్రభుత్వ స్కూళ్ల  భారమంతా వీళ్లపైనే 
  • అసెంబ్లీ సాక్షిగా 30 శాతం సాలరీస్​ పెంచుతామన్న   కేసీఆర్
  • పక్క రాష్ట్రంలో రెండేళ్ల కిందే పెంచినా ఇక్కడ దిక్కులేదు 
  • అరకొర జీతాలతో కుటుంబపోషణకు ఇబ్బందులు
  • కరోనాతో వెయ్యి మంది చనిపోయినా పట్టించుకోని సర్కారు
  • 17వేలకు పైగా కాంట్రాక్ట్​ ఉద్యోగుల ఎదురుచూపులు

పెద్దపల్లి, వెలుగు: సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న 18 వేల మంది  కాంట్రాక్ట్​ ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు కావట్లేదు. ఏప్రిల్​లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్​ మాట ఇచ్చినా అతీగతి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్ సీ అమలవుతున్నా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మాత్రం పాత వేతనాలే ఇస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీలో రెండేళ్ల కిందే సాలరీస్​ పెంచినా, మన దగ్గర ఇప్పటికీ పెంచకపోవడంతో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​అంతా కుటుంబపోషణకు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎస్ఏ పరిధిలో కేజీబీవీ టీచర్లు, సిబ్బంది సహా డీఈఓ, ఎంఈఓ ఆఫీసుల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు, మెసేంజర్లు, ఎంఐఎస్​కోఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సీఆర్పీలు దాదాపు17 వేలకు పైగా ఉంటారు. వీళ్లకు కనిష్ఠంగా 8వేల నుంచి గరిష్ఠంగా16వేల వరకు మాత్రమే సాలరీ అందుతోంది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఎస్ఏలో కాంట్రాక్ట్​ ఉద్యోగులను ఎంట్రన్స్​టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ఏపీలోని కాంట్రాక్ట్​ఎంప్లాయీస్​ సాలరీస్​ను అక్కడి ప్రభుత్వం 23,500కు పెంచింది. ఇటీవల ఈ మొత్తాన్ని రూ. 29,400 చేసిన ఏపీ సర్కారు, ఎంప్లాయీస్​కు ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 2లక్షలు, చనిపోతే రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తోంది. కానీ ధనిక రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్​ఎంప్లాయిస్​సాలరీస్​ పెంచలేదు. 
ఎన్నో బాధ్యతలు
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ భారమంతా  కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​పైనే ప్రభుత్వం మోపింది. తమకు అప్పగించిన స్కూళ్లకు సంబంధించిన అన్ని రికార్డులను ఆన్​లైన్​ చేయడం, బడీడు పిల్లలను బడిలో చేర్పించడం, డ్రాపౌట్స్​తగ్గించడంతో పాటు కాంప్లెక్స్​ లెవల్​లో టీచర్లకు జరిగే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం వీళ్ల మెయిన్​ డ్యూటీ. సింగిల్​టీచర్​స్కూళ్లలో టీచర్లు లీవ్​లో ఉన్నప్పుడు సీఆర్పీలే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది.  స్కూళ్లకు యూనిఫామ్స్,  టెక్స్ట్​బుక్స్​సప్లై చేయడం, మిడ్​డే మీల్స్​సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యతలను కూడా కాంట్రాక్ట్​ఎంప్లాయీస్​ కే అప్పగించారు. దీంతోపాటు ఎంపీడీఓ ఆదేశాల మేరకు పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల నిర్వహణ, హరితహారం సర్వేలు, జియో ట్యాగింగ్​కు కూడా వీళ్ల సేవలనే ఉపయోగించుకుంటున్నారు.
 60 శాతం పెంచాలన్న పీఆర్సీ
బిశ్వాల్ నేతృత్వంలోని పీఆర్సీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ ఉద్యోగులకు 7.5, కాంట్రాక్టు  ఉద్యోగులకు 60 శాతం ఫిట్​మెంట్​ఇవ్వాలని చెప్పింది. అలాగే  కాంట్రాక్ట్​ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రూ. వెయ్యి చొప్పున పెంచాలని సూచించింది. పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం, కాంట్రాక్టు ఉద్యోగులకు 30 శాతం ఇస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొన్నిరంగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు  పెంచిన వేతనాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఎస్ఎస్ఏలోని కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఉద్యోగులకు ఇప్పటికీ పాత జీతమే వస్తోంది. ఉద్యోగులు ప్రమాదవశాత్తు చనిపోయినా ఎలాంటి నష్టపరిహారం ఇస్తలేదు. కరోనా టైంలో దాదాపు వెయ్యి మంది చనిపోయినా ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ చెబుతున్నారు. 
పక్క రాష్ట్రం ఇచ్చినట్టు  ఇయ్యాలే
పక్క రాష్ట్రం ఏపీలో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనూ జీతాలు పెంచి ఇవ్వాలి, ప్రమాద బీమా, అలవెన్స్​లు కూడా అందజేయాలి.  ఉద్యోగులను వేధింపులకు గురిచేసేలా ఉన్న  బాండింగ్​ సిస్టం తీసేయాలి. ప్లానింగ్​ అప్రూవల్​ బోర్డు నిర్ణయించినట్లు  రూ. 21,500  జీతంతో పాటు సీఎం హామీ ఇచ్చినట్లుగా 30 శాతం పీఆర్సీ అమలు చేయాలి. చనిపోయిన ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.                                                                                                                                                                     - దుండిగల్​యాదగిరి, ఎస్ఎస్ఏ జాక్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి