
ఎట్టకేలకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అనేక పోరాటాల తర్వాత టీఆర్‌టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జిల్లాస్థాయి కమిటీల నియామకాలతో పాటు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. అన్ని కొత్త జిల్లాల నుంచి సమాచారం తీసుకొని.. పాత జిల్లాల ప్రకారమే టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో టీఎస్‌పీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన 7,414 పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. ఇందులో ఎస్‌జీటీ, ఎస్‌ఏ రెండింటికీ ఎంపికైన వారు ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి జీవో నంబర్10ని విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మెన్‌గా జాయింట్ కలెక్టర్, సెక్రెటరీగా డీఈఓతోపాటు జెడ్పీ సీఈఓ/ మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ నామినేట్ చేసే ఐటీడీఏ పీఓ లేదా కొత్త జిల్లా డీఈఓ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రోస్టర్ మరియు మెరిట్ లిస్ట్(ర్యాంక్) ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. కొత్త జిల్లాలకు చెందిన డీఈవోల సమన్వయంతో సబ్జెక్ట్, మీడియం, ఏరియా వైజ్ కేటగిరీలుగా టీచర్ పోస్టుల లిస్ట్‌లు తయారు చేస్తారు. టీచర్ స్టూడెంట్స్ రేషియో ఆధారంగా ఎక్కువ స్టూడెంట్లున్న స్కూళ్లలో నియామకాలు చేపట్టాలని, మారుమూల ప్రాంతాలకు టీచర్లు వెళ్లేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాలికల స్కూళ్లలో మహిళా అభ్యర్థులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోస్టింగ్‌లు పొందిన టీచర్ల వివరాలను వెబ్‌సైట్‌తోపాటు డీఈవో ఆఫీసులోని నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఈ నెల మూడోవారంలో టీఆర్‌టీ నియామకాలపై తుది విచారణ ఉన్నందున టీఆర్‌టీ జిల్లా కమిటీల ఏర్పాటుకు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
త్వరలోనే షెడ్యూల్
టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించిన సర్కారు గ్రీన్ సిగ్నల్ చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకట్రెండు రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాష్ర్టంలో తొలిసారిగా సర్కారీ స్కూళ్లలో టీచర్ రిక్రూట్‌మెంట్ జరగనుంది. 2017 అక్టోబర్ 22న టీఎస్‌పీఎస్సీ 8,792 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా వాటిలో ఎస్‌జీటీ 5,415, స్కూల్ అసిస్టెంట్స్ 1,941, పీఈటీలు 416, లాంగ్వేజీ పండిట్స్ 1,011, ఫిజికల్ ఎడ్యుకేషన్ 9 పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,45,158 దరఖాస్తులు రాగా, ఎస్‌జీటీకి 89,149 వచ్చాయి. అభ్యర్థులకు 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకూ టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించింది. ఫలితాలన్నీ ఒకేసారి కాకుండా సబ్జెక్టుల వారీగా విడుదల చేసింది. ఇప్పటివరకు 8,792 పోస్టుల్లో 7,414 పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. మరో 1,378 పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అందులో పీఈటీ, ఎస్‌ఏ హిందీ, ఎల్‌పీ హిందీ, ఎస్‌జీటీ పోస్టులున్నాయి. రిక్రూట్‌మెంట్ కోసం విద్యాశాఖ ఎప్పుడో ఫైల్ పంపింనా సీఎం ఆమోదం తెలుపలేదు. దీంతో నెలల తరబడి రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం టీఆర్‌టీ జిల్లా కమిటీల ఏర్పాటు, గైడ్‌లైన్స్‌పైనే చేశారు.
టీచర్స్ యూనియన్ల హర్షం
టీఆర్‌టీ నియామకాల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై టీచర్ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా జాప్యం లేకుండా వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. టీఆర్‌టీ నియామకాల ద్వారా సర్కారు స్కూళ్లు బలోపేతమవుతాయనీ పీఆర్‌టీయూ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు అన్నారు. ఇది టీఆర్‌టీ అభ్యర్థులు, టీచర్ యూనియన్ల పోరాట ఫలితమేనని టీపీటీఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, మీస శ్రీనివాస్ తెలిపారు. ఎస్‌ఏ (హిందీ), ఎల్‌పీ హిందీ, పీఈటీ పోస్టుల రిజల్ట్ కూడా ప్రకటించాలని టీటీఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ రఘునందన్, కె రమణ డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల నియామకాల కంటే ముందే సీనియర్ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని టీఎస్టీయూ రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి కోరారు.