
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. రూల్స్ ప్రకారం టేబుల్ టాప్ లో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఛాంపియన్స్ లీగ్ దశలో అగ్ర స్థానంలో నిలిస్తే.. ఇండియా ఛాంపియన్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారం తొలి సెమీ ఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్ ధవన్ సహా పలువురు ఇండియా వెటరన్ ప్లేయర్లు పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
లీగ్ మ్యాచ్ కావడంతో ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు చేయవచ్చు. అయితే ఈ రెండు జట్లు ఇప్పుడు సెమీ ఫైనల్ కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ లో ఇండియా ఛాంపియన్స్ పాకిస్థాన్ తో ఆడుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పాకిస్థాన్ తో నాకౌట్ మ్యాచ్ అయినా ఆడేది లేదని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు. గురువారం (జూలై 31) బర్మింగ్ హోమ్ వేదికగా ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్ల మధ్య సెమీస్ ఫైనల్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఆడకుండా టీమిండియా తప్పుకుంటే పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడకపోతే పరిస్థితి ఏంటి..?
రూల్స్ ప్రకారం.. ఇండియా ఛాంపియన్స్ సెమీ-ఫైనల్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో ఆడటానికి నిరాకరిస్తే మొహమ్మద్ హఫీజ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు వాకోవర్ లభిస్తుంది. దీంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్ రద్దయిన గ్రూప్ దశలో అగ్ర స్థానంలో ఉండడంతో పాక్ ఫైనల్ కు చేరుతుంది. గ్రూప్ దశలో పాకిస్థాన్ తో ఇండియా ఆడడానికి నిరాకరించడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు.
►ALSO READ | WCL 2025: వెస్టిండీస్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు.. సెమీస్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఢీ
వెస్టిండీస్ ఛాంపియన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ:
మంగళవారం (జూలై 29) వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 145 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేజ్ చేసి సెమీస్ కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో తొలి విజయం సాధించిన మన జట్టు సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా ఛాంపియన్స్ 13.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.