
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ప్రయాణిస్తోన్న వాహనం సింధు నదిలోకి దూసుకెళ్లింది. గండేర్‌బల్ జిల్లాలోని కుల్లన్ ప్రాంతం దగ్గర బుధవారం (జూలై 30) ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్ నదిలో పడిపోవడంతో కొందరు సిబ్బంది, వెపన్స్ నీటిలో గల్లంతయ్యాయి.
సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. నీటిలో గల్లంతైన మూడు వెపన్స్ రికవరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో జవాన్లు ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్గా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు, జవాన్లు ఊపిరి పీల్చుకున్నారు.
గండేర్బల్ ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం (జూలై 30) తెల్లవారుజామున గండేర్బల్‌లోని రెజిన్ కుల్లన్లో ఐటీబీపీ సైనికులను తీసుకెళ్లే వాహనం మూల మలుపు వద్ద అదుపు తప్పి సింధ్ నదిలో పడిపోయిందని తెలిపారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఐటీబీపీ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని.. ఘటన స్థలంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సహయక చర్యలు చేపట్టిందని వివరించారు. వాహనంలోని వెపన్స్ నదిలో గల్లంత అయ్యాయని.. అందులో మూడు ఆయుధాలను రికవరీ చేసినట్లు తెలిపారు.