
న్యూఢిల్లీ: సింధూ నది జలాల ఒప్పందంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. బుధవారం (జూలై 30) రాజ్య సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఆపే వరకు సింధూ నది జలాల ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని పునరుద్ఘాటించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేయడం భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు.
అప్పటి భారత ప్రభుత్వం సొంత దేశ రైతుల ప్రయోజనాల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని సిందూ నది జలాల ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని లైట్ తీసుకుందని, ప్రపంచ వేదికలపై పాకిస్తాన్‌ను ఉగ్రబాధిత దేశంగా చిత్రీకరిస్తోందని ప్రతిపక్ష పార్టీపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఉగ్రవాద అంశాన్ని ప్రపంచ ఎజెండాలో ఉంచడంలో భారత్ విజయం సాధించిందని అన్నారు.
►ALSO READ | ఆ ధైర్యం మోదీకి లేదు.. అందుకే తప్పించుకుంటున్నారు.. : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులను నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిదిద్ది చూపించిందన్నారు. అనాలోచితంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని రద్ద చేశాం.. అలాగే సిందూ నది జలాల ఒప్పందాన్ని కూడా సరి చేసి చూపిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాక్ కాల్పుల విరమణ ఒప్పందం మధ్య మూడో వ్యక్తి/దేశ ప్రమేయం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
దైప్వాక్షిక చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరిందని.. దాడి చేస్తే పాక్‌కు తగిన బుద్ధి చెబుతామని చెప్పామన్నారు. కాల్పుల విరమణ గురించి ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు మంత్రి జైశంకర్.