
2026 మార్చి కల్లా ఈ దేశం నుంచి మావోయిస్టులను నిర్మూలించడం కేంద్రంలోని మోదీ సర్కారుకు అసాధ్యమేమీ కాకపోవచ్చు! కానీ 58 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో నక్సలిజం ప్రసరించిన ‘సమ సమాజ’మనే ఆశారేఖను ఈ దేశ దిగువ, మధ్యతరగతి మనోనేత్రాల నుంచి తొలగించడం పాలకులకు అంత ఈజీ కాదు! మావోయిస్టులతో చర్చలు జరిపితే వాళ్లు పెట్టే డిమాండ్లు ఎలాంటివో అందరికీ తెలుసు. కానీ వాటిని నెరవేర్చడం ఏమాత్రం ఇష్టంలేని బీజేపీ సర్కారు మావోయిస్టులను తుదముట్టించడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాను అమలుచేస్తోంది. ఇందుకోసం దండకారణ్యం వేదికగా సొంత పౌరులపైనే యుద్ధం చేస్తోంది.
మావోయిస్టులను చంపినంత మాత్రాన వాళ్ల ఆశయాలు చచ్చిపోతాయా? దేశం వెలిగిపోతోందని మోదీ ఎంత చెప్పినా.. సామాజిక అంతరాలతోపాటు ప్రజల నడుమ ఆర్థిక అసమానతలు మరింత పెరిగిపోయాయని చెప్తున్న గణాంకాల సంగతేంటి? ఒకప్పుడు భూస్వాముల భూములను పేదలకు పంచారని విన్నాం. ఇపుడు పేదల సొమ్మును ధనవంతులకు పంచుతున్నారని వింటున్నాం. గడిచిన 11 ఏండ్లుగా కూడా ఈ దేశంలో జరిగింది అదే!
ప్రచారం ఇలా..
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత ఆర్థిక వ్యవస్థ గణనీయ అభివృద్ధి సాధించిందని బీజేపీ అనుకూల వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ‘2014లో భారత జీడీపీ సుమారు 2 ట్రిలియన్ యూఎస్ డాలర్లు ఉండగా, 2023 నాటికి ఇది 3.75 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే 87% పెరుగుదల నమోదైంది.2025లో ఇండియా జపాన్ను దాటి ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2027 నాటికి 3వ అతిపెద్ద ఎకానమీగా మారే అవకాశం ఉంది. 2011–-12లో తీవ్ర పేదరికం 27% ఉండగా, 2022–-23కు 5.25% కు తగ్గింది. దాదాపు 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.’ ఇవీ బీజేపీ మద్దతుదారులు చెప్పే మాటలు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.
వాస్తవాలు ఇవీ..
వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ (డబ్ల్యూఐఎల్) నివేదిక ప్రకారం 2014–-15 నుంచి 2022–-23 వరకు దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. 2022–-23లో టాప్ 1 శాతం ధనవంతుల ఆదాయం వాటా 22.6%. 1922 తర్వాత ఇదే అత్యధికం. అంటే బ్రిటిష్ పాలనలో కన్నా ఎక్కువ. ఇక టాప్ 10శాతం మంది ధనవంతుల వాటా సుమారు 58%, దిగువన ఉన్న 50శాతం జనాభా ఆదాయం వాటా కేవలం 15%. సంపదలో మరీ ఘోరం. టాప్ 1 శాతం ధనవంతుల సంపద 40% కాగా, 1961 తర్వాత ఇదే అత్యధికం. ఇక టాప్ 10శాతం ధనవంతుల సంపద 65%, దిగువన50శాతం ప్రజల సంపద వాటా కేవలం 6 నుంచి -7% మాత్రమే. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం చూసినా భారత్‌లో టాప్ 10శాతం జనాభా 77% జాతీయ సంపదను కలిగి ఉంది. 2017లో ఉత్పత్తి అయిన సంపదలో 73% టాప్ 1శాతం ధనవంతుల చేతిలోకి వెళ్లింది. 2024లో బిలియనీర్ల సంపద వృద్ధి ఏకంగా మూడు రెట్లు పెరిగింది.
పెరుగుతున్న కుబేరులు..
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా–2025 ప్రకారం ప్రపంచంలో 3వేల మందికి పైగా కుబేరులున్నారు. 902 మంది కుబేరులతో అమెరికా టాప్‌లో ఉండగా, 205 మంది కుబేరులతో ఇండియా మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో18వ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అబానీ సంపద విలువ ఏకంగా 92.5 బిలియన్ డాలర్లు. ఆసియా, భారత్ లో ఆయనదే అగ్రస్థానం. 28వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 56.3 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో రెండో స్థానంలో, ఆసియాలో నాలుగో స్థానంలో నిలిచారు. అటు కేంద్రం అనుసరిస్తున్న ధనికవర్గ అనుకూల విధానాలతో మన దేశంలో సంపన్నుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. తాజాగా ‘మెర్సిడెస్ బెంజ్‌హురున్ ఇండియా వెల్త్‌రిపోర్టు- 2025’ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 8.5 కోట్లకు (1 మిలియన్‌డాలర్లకు)పైబడి ఆస్తి కలిగిన మిలియనీర్ల కుటుంబాలు ప్రస్తుతం దేశంలో 8.71 లక్షలు ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆ సంఖ్య 90 శాతం పెరిగింది.
16లక్షల కోట్లు మాఫీ..
2014 తర్వాత కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు భారీగా రుణమాఫీ (లోన్ రైట్-ఆఫ్) చేసింది. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2014–-15 నుంచి 2023–-24 మధ్యకాలంలో షెడ్యూల్డ్, కమర్షియల్ బ్యాంకులు మొత్తం ₹16.35 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. ఇందులో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాఫీ చేసిందే ఏకంగా ₹12.08 లక్షల కోట్లు. ఇదంతా ప్రజల సొమ్ము. మాఫీ పొందిన సంస్థల్లో గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ (మీర్ చొక్సీ ₹7,848 కోట్లు), ఎరా ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ (₹5,879 కోట్లు), ఆర్‌ఈఐ ఆగ్రో లిమిటెడ్( ₹4,803 కోట్లు), కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్( ₹4,596 కోట్లు), ఎబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ (₹3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్( ₹3,311 కోట్లు), విన్సమ్ డైమండ్స్ & జ్యువెలరీ(₹2,931 కోట్లు), రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ( ₹2,893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(₹2,311 కోట్లు), జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్( ₹2,147 కోట్లు) లాంటి బడా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి.
పేదరికంలో పాకిస్తాన్‌తో పోటీ..
ప్రపంచంలో పేదరికాన్ని కొలిచేందుకు ప్రధానంగా రెండు సూచికలున్నాయి. ఒకటి గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) కాగా, రెండోది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ). ఇవి ఆర్థికం, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా పేదరికాన్ని కొలుస్తాయి. ఎంపీఐ ప్రకారం భారత్‌లో 23.4 కోట్ల మంది అత్యంత నిరుపేదలున్నారు. మొత్తం 112 దేశాల్లో 21% పేదలతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. జీహెచ్ఐ ప్రకారం127 దేశాల్లో 105వ స్థానానికి పరిమితమైంది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (84), నేపాల్ (68), శ్రీలంక (56) మనకన్నా బెటర్ స్థానంలో ఉండగా, పేదరికంలో మనం పాకిస్తాన్ (109వ) తో పోటీపడడం విచారకరం.
కారణాలు ఇవీ..
మోదీ సర్కారు తెచ్చిన జీఎస్టీ, డిమోనిటైజేషన్, కార్పొరేట్ ట్యాక్స్ కట్స్‌తో పాటు క్రోనీ క్యాపిటలిజం, రాజకీయ అవినీతి, అభివృద్ధి మొత్తం పట్టణాల చుట్టూ కేంద్రీకృతం కావడం, ధనికులకు అనుకూలమైన పన్ను విధానాలు మిలియనీర్లకే మేలుచేశాయని, అదే సమయంలో అనేక పరిశ్రమలు మూతపడడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, తయారీరంగాన్ని ప్రోత్సహించకపోవడం, గ్రామాలు, వ్యవసాయరంగం, కుటీరపరిశ్రమలపై నిర్లక్ష్యం, నిరుద్యోగం, అసంఘటిత రంగంలోని సమస్యలు పేదలను మరింత పేదలుగా మార్చాయని వివిధ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. మొత్తం జీడీపీలో ఆరోగ్యం కోసం 1.8%, విద్య కోసం 3% కంటే తక్కువ ఖర్చు చేయడం కూడా ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్‌పై చేసే ఖర్చు చాలా తక్కువ కావడంతో మెరుగైన విద్య, వైద్యం కోసం మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయడం, ఆస్తులను అమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది.
చేయాల్సింది చేయట్లే..
భారతదేశంలో అసమానతలు తగ్గించడానికి ఆర్థిక నిపుణులు, ఐఎంఎఫ్, యూఎన్, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇటీవలి కాలంలో పలు విలువైన సూచనలు చేశాయి. ధనికులు, కార్పొరేట్లపై పన్ను రేట్లు పెంచడం, వారసత్వ పన్ను ప్రవేశపెట్టడం, పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయడం, పెన్షన్లు, ఆహార సబ్సిడీలు పెంచడం, పల్లెల్లో భూ సంస్కరణల అమలు, గ్రామీణ ఉపాధి పథకాల విస్తరణ, అర్బన్ నిరుద్యోగుల కోసం కొత్త ఉపాధి హామీ పథకాల అమలు, అసంఘటిత రంగంలో కనీస వేతనాల పెంపు, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, యువత, మహిళలకు విరివిగా రుణాలివ్వడం, ఆదాయం, సంపదలో దళితులు, మహిళల ప్రాతినిధ్యం పెంచడం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల పెంపు, బడ్జెట్లో విద్య, వైద్యం కేటాయింపులు పెంచడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఇంచుమించు మావోయిస్టుల ఎజెండా కూడా ఇదే. కానీ ఈ సంస్కరణలను అమలుచేయడం మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు ఏమాత్రం ఇష్టం లేనట్లు గత 11 ఏండ్ల అనుభవం రుజువు చేస్తోంది.
బీజేపీ పాలనలో బడా కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసిన సొమ్ము (కోట్లలో)
2014-15 ₹ 58,786
2015-16 ₹ 64,000
2016-17 ₹ 1,14,000
2017-18 ₹ 1,77,000
2018-19 ₹ 2,36,265
2019-20 ₹ 2,32,000
2020-21 ₹ 2,00,000
2021-22 ₹ 1,94,000
2022-23 ₹ 2,16,000
2023-24 ₹ 1,70,270
- చిల్ల మల్లేశం, సీనియర్ జర్నలిస్ట్