మనీ సర్క్యులేషన్ స్కీమ్ లను నమ్మొద్దు

 మనీ సర్క్యులేషన్ స్కీమ్ లను నమ్మొద్దు
  • బడుగు హరికృష్ణ సూసైడ్ కేసులో నిందితుల అరెస్ట్
  • వివరాలు వెల్లడించిన సీపీ విజయ్ కుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: మనీ సర్క్యులేషన్ స్కీమ్ లను ఎవరూ నమ్మొద్దని, క్యూనెట్ ఒక మహమ్మారి అని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం సీపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడుగు హరికృష్ణ సూసైడ్​కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ  బెట్టింగ్ యాప్ ల బారిన పడి రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. 

వాటిని తీర్చే మార్గాల కోసం వెతుకుతుండగా అదే గ్రామానికి చెందిన కాల్వల మణికంఠారెడ్డి పరిచయమయ్యాడు. కొన్ని డబ్బులు ఇన్వెస్ట్​చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని అతడు, అతడి పెద్ద నాన్న కూతురు మెదక్ జిల్లా చెట్ల గౌరారం గ్రామానికి చెందిన ఉప్పలపు ఆలేఖ్య హరికృష్ణని నమ్మించారు.

దీంతో అతడు జులైలో హైదరాబాద్ లోని క్యూ నెట్ ప్లాట్ ఫామ్ అనే అన్ లైన్ పోర్టల్ మీటింగ్ కు వెళ్లి రూ. 4 లక్షలు ఇవ్వగా వారు హరికృష్ణకు మెంబర్​షిప్ ఇచ్చారు. తర్వాత స్నేహితులు, బంధువులతో  రూ. 4 లక్షలు కట్టించాలని, అప్పుడు ఒక్కొక్క మెంబర్ ద్వారా రూ. 50వేల వరకు కమిషన్ వస్తుందని లేదంటే డబ్బులు రావని చెప్పారు. 

దీంతో హరికృష్ణ మోసపోయినట్లు గ్రహించి ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడని సీపీ తెలిపారు. హరికృష్ణ తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విచారణలో అతడి మరణానికి కాల్వల మణికంఠ రెడ్డి, ఉప్పలపు ఆలేఖ్య కారణమని తేలగా ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో  అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీ నరసింహులు, సీఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.