
- సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకం లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్తులు జారీ చేయాలని కోరుతూ ఆ కేసులో ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. రామ చంద్రభారతి, కోరె నందు కుమార్, డీపీఎస్‌కేవీఎన్ సింహయాజి సంయుక్తంగా మంగళవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు జైల్లో ఉన్నందున సంతకాలు చేయకుండా వారి తరఫున లాయర్ కృష్ణ ఈ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ నెల 9న ప్రభుత్వం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏడుగురితో ఏర్పాటు చేసిన సిట్‌పై స్టే ఉత్తర్వులు జారీ చేయాలని నిందితులు తమ పిటిషన్‌లో కోరారు.
మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును సిట్‌కు బదిలీ చేయడం సరికాదని, సీబీఐ దర్యాప్తుకు లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్ విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగడం లేదు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే దర్యాప్తు జరుగుతోంది. సిట్ చీఫ్ ఆనంద్ కాబోయే డీజీపీ అనే విషయం అందరికీ తెలిసిందే. సీఎం చెప్పినట్లుగానే సిట్ ముందుకు వెళుతోంది. సంబంధం లేని వాళ్లకు సిట్ 41ఎ నోటీసులు ఇచ్చింది. కేసు నమోదుకు ముందే పోలీస్ కమిషనర్ మొయినాబాద్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. టీవీ చానల్స్‌తో కేసు గురించి మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండదు. సిట్ కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుందనే విశ్వాసం లేదు. సిట్ దర్యాప్తుకు ముందే ప్రభుత్వ పెద్దలు కేసు గురించి మాట్లాడారు. కేసుకు చెందిన సీడీలు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల హైకోర్టుల సీజేలకూ సీల్డ్ కవర్‌లో పంపించారు. వీటన్నింటినీ పరిశీలిస్తే సిట్ దర్యాప్తు స్వతంత్రంగా జరుగుతుందనే నమ్మకం ఏమాత్రం లేదు” అని నిందితులు పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ ఉత్తర్వులు అందుబాటులోకి రాక ముందే ఇక్కడి హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలకు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని, తప్పుడు ప్రచారం మీడియాలో కూడా వచ్చిందని వారు చెప్పారు. ఆధారాలు లేకపోయినా బీజేపీ నేతలను సిట్ దర్యాప్తునకు పిలుస్తోందని, తక్షణమే సిట్ దర్యాప్తును నిలిపివేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని వారు ఆ అనుబంధ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.