
లింగాల, వెలుగు: విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బుధవారం లింగాలలో రూ.2.30 కోట్ల పీఎం జన్మన్ స్కీమ్ నిధులతో జడ్పీ హైస్కూల్, బాలుర హాస్టల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యా శాఖకు బడ్జెట్లో కేటాయింపులు పెంచారని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, పాఠ్య పుస్తకాలను అందజేశామన్నారు. 20 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.
ప్రమోషన్ లేకుండానే ఉద్యోగ జీవితం ముగిసిపోతుందనే ఆందోళనతో ఉన్న వేలాది మంది టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించిందని చెప్పారు. ప్రతి పాఠశాలలో టీచర్ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు యూనిఫాం అందజేశారు. ఎంఈవో బషీర్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్ రాథోడ్, పూజారి వెంకటయ్య, శివ, వెంకట్, రాజేశ్ పాల్గొన్నారు.
రైతు సంక్షేమం కోసం కృషి..
అచ్చంపేట: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అండగా ఉంటూ, రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బల్మూర్ మండలం మహదేవపూర్ గ్రామంలో రైతులకు సబ్సిడీపై స్ర్పింక్లర్లను అందజేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో డైరెక్టర్లు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మద్దతు ధర ఇచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్మన్ వెంకటయ్య, నేతలు మల్లేశ్, వెంకట్ రెడ్డి, రాంప్రసాద్ గౌడ్, కాశన్న యాదవ్, ఏవో చంద్రశేఖర్, మార్కెట్ సెక్రటరీ నరసింహ పాల్గొన్నారు.