అనర్హత నోటీసులపై జూలై 11 వరకు చర్యలొద్దు

 అనర్హత నోటీసులపై జూలై 11 వరకు చర్యలొద్దు
  • అనర్హత నోటీసులపై ఇప్పుడే చర్యలు తీసుకోవద్దన్న సుప్రీం 
  • తదుపరి విచారణ జులై 11 తేదికి వాయిదా వేసిన కోర్టు

న్యూఢిల్లీ/ ముంబై/ గౌహతి: శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి జారీ చేసిన అనర్హత నోటీసులపై జులై 11 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, అసెంబ్లీలో ఎటువంటి బలపరీక్ష ఉండకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టవిరుద్ధమైన పరిస్థితుల్లో వారు ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని పేర్కొంది. తమకు అనర్హత నోటీసులు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాల్ ఆధ్వర్యంలోని వెకేషన్​ బెంచ్​ఈ పిటిష్లనను విచారించింది. 39 మంది శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెబెల్​ ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై అఫిడవిట్​ దాఖలు చేయాలంటూ డిప్యూటీ స్పీకర్​ కు  సూచించింది.  అలాగే రెబెల్​ ఎమ్మెల్యేల ప్రాణ, ఆస్తుల రక్షణకు తీసుకున్న చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్టేట్ మెంట్​ ను రికార్డు చేసింది. కేసు విచారణను జులై 11కు వాయిదా వేసింది. 

రెబెల్​ మినిస్టర్లపై చర్యలు..

అస్సాంలోని గౌహతిలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంపులో ఉన్న తొమ్మిది మంది మంత్రుల పోర్టుఫోలియోలను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రే సోమవారం తొలగించారు. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఈ మంత్రుల పోర్టుఫోలియోలను తొలగించి ఇతర మంత్రులకు అప్పగిస్తున్నట్టు సోమవారం అధికారిక ప్రకటన విడుదలైంది. కేబినెట్​ మంత్రి ఏక్​నాథ్​ షిండే నేతృత్వంలో కొద్దిరోజుల క్రితం శివసేనలో అసమ్మతి మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివసేనకు నలుగురు కేబినెట్​ మంత్రులు మాత్రమే ఉన్నారు. సీఎం ఉద్ధవ్​ థాక్రే, ఆదిత్యథాక్రే, అనిల్​ పరబ్, సుభాష్​ దేశాయ్ మాత్రమే ఈ లిస్ట్​లో ఉన్నారు. ఆదిత్య థాక్రేను మినహాయిస్తే మిగతా ముగ్గురు ఎమ్మెల్సీలే. షిండే పోర్ట్ ఫోలియోలోని అర్బన్​ డెవలప్​మెంట్, పబ్లిక్​ అండర్​టేకింగ్​ శాఖలను సీనియర్​ శివసేన నాయకుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్​ దేశాయ్​కి అప్పగించారు. ఉదయ్​ సామంత్ ​దగ్గర ఉన్న హయ్యర్​ ఎడ్యుకేషన్ శాఖను ఆదిత్య థాక్రేకు ఇచ్చారు. మిగతా మంత్రుల శాఖలను కూడా ఇతరులకే అప్పగించారు. కాగా, గువాహటిలో శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలు  ఉన్న హోటల్​ దగ్గర పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం హోటల్​కు వచ్చిన మణిపూర్​ శివసేన చీఫ్​ ఎం తోంబి సింగ్ ను లోపలికి అనుమతించలేదు.