- సీఎం, సీఎస్ స్పందించాలి.. లేకుంటే ఆమరణ దీక్ష చేస్తా: బాలలత
ఖైరతాబాద్/రంగారెడ్డి, వెలుగు: దివ్యాంగులు ఐఏఎస్ లుగా పని చేయలేరంటూ అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని సీఎస్ బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్, మాజీ ఐఏఎస్ మల్లవరపు బాలలత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి పోస్టు పెట్టడం దారుణమని, ఆమెపై సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ట్యాంక్ బండ్ పై ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక ప్రభుత్వ అభిప్రాయాలా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఆమె వ్యతిరేకిస్తున్నారా? అన్నది చెప్పాలన్నారు. దివ్యాంగులు ఎక్కువ సేపు పని చేయలేరంటూ వారి సామర్థ్యాన్ని నిర్ణయించడానికి స్మితకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. ఏ అంశాల ప్రాతిపదికగా ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందో చెప్పాలన్నారు. ‘‘స్మితా సబర్వాల్ కు, నాకు సివిల్స్ ఎగ్జామ్ పెట్టండి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం” అని బాలలత ఓపెన్ చాలెంజ్ చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తొలి ఉద్యోగం ఒక దివ్యాంగురాలికి ఇచ్చారు. ఆమె సామర్థ్యాన్ని చూసి ఇచ్చారా? లేదంటే ఊరికే ఇచ్చారా? అన్నది సీఎం స్పందించి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది” అని ఆమె కోరారు.
కేసీఆర్, కేటీఆర్ కూడా స్పందించాలి..
స్మితా సబర్వాల్ కామెంట్లపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కూడా తక్షణమే స్పందించాలని బాలలత డిమాండ్ చేశారు. దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలకు స్మిత క్షమాపణలు చెప్పకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అసలు దివ్యాంగులు బతకడమే వేస్ట్ అన్నట్టుగా ఆమె ధోరణి ఉందని విమర్శించారు. అఖిలభారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. స్మిత ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరతామన్నారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పరువునష్టం దావా కూడా వేస్తామన్నారు. సమావేశంలో పీఓడబ్ల్యూ నేత సంధ్య తదితరులు మాట్లాడారు.
ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు
దివ్యాంగులను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్మితా సబర్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ జంగయ్యతో పాటు పలువురు దివ్యాంగులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్మిత ఇలాంటి అవగాహన లేని వ్యాఖ్యలు మానుకోవాలని కోరారు.
