IVF Centres: రూల్స్ బ్రేక్ చేసే సెంటర్లపై చర్యలు తప్పవు : మంత్రి దామోదర వార్నింగ్

IVF Centres: రూల్స్ బ్రేక్ చేసే సెంటర్లపై చర్యలు తప్పవు : మంత్రి దామోదర వార్నింగ్
  • ప్రభుత్వ ఐవీఎఫ్​ సెంటర్ల సేవలను పెంచడానికి డాక్టర్లు కృషి చేయాలని సూచన 
  • కొండాపూర్​లోనూ ఐవీఎఫ్​ కేంద్రం ప్రారంభిస్తామని వెల్లడి​
  • గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి
  • స్పెషల్​ ఆఫీసర్​ను నియమిస్తామని ప్రకటన

పద్మారావునగర్, వెలుగు: రూల్స్ బ్రేక్  చేసిన ఐవీఎఫ్​ సెంటర్లపై చర్యలు తప్పవని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. రాష్ర్టంలో 379 ఐవీఎఫ్​ కేంద్రాలు ఉంటే ఒక్క హైదరాబాద్​లోనే 150కి పైగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి గాంధీ హాస్పిటల్​ను సందర్శించారు. ఇటీవల పత్రికల్లో గాంధీ దవాఖాన గురించి చాలా వార్తలు వస్తున్నాయని, గాంధీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. 

ఓపీ బ్లాక్​లోని పలు వైద్య విభాగాలను పరిశీలించి ఔట్​ పేషెంట్లతో మాట్లాడారు. ఎంసీహెచ్​ బిల్డింగ్ కు వెళ్లి ఐవీఎఫ్​సెంటర్​ను సందర్శించి, కేసుల పురోగతి గురించి డాక్టర్లను అడిగి  తెలుసుకున్నారు. తర్వాత మెయిన్  బిల్డింగ్​లోని కాన్ఫరెన్స్​హాల్​ లో డీఎంఈ డాక్టర్​ నరేంద్ర కుమార్, వివిధ డిaపార్ట్​మెంట్ల హెచ్ఓడీలతో  రివ్యూ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. 

గాంధీలో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్​లో లోపాలు లేకుండా ఓ స్పెషల్​ ఆఫీసర్​ను నియమిస్తామని తెలిపారు. 12 మంది బయోమెడికల్ ఇంజినీర్ల అవసరం ఉందని, ఈ పోస్టులను క్రియేట్​చేస్తామన్నారు. సీఎస్ఆర్​ కింద గాంధీలో వివిధ పనులు చేయడానికి ఐసీఐసీఐ, పవర్​గ్రిడ్, ఎన్టీపీసీ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. రూ.5 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలోనే మొదటి ప్రభుత్వ ఐవీఎఫ్​ సెంటర్ ​గాంధీ ఎంసీహెచ్​లో చక్కగా పనిచేస్తున్నదని, ఇప్పటివరకు 23 కేసులను ఎంపిక చేశామని, ఇందులో రెండు పాజిటివ్​ రిజల్ట్స్​ వచ్చాయని పేర్కొన్నారు. 

ప్రైవేట్​ఐవీఎఫ్​ సెంటర్లకు దీటుగా ప్రభుత్వ ఐవీఎఫ్​ సెంటర్ల సేవలను పెంచడానికి డాక్టర్లు కృషి చేయాలన్నారు. త్వరలో కొండాపూర్​లో ఐవీఎఫ్​ కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గాంధీలోని ఔట్​సోర్సింగ్  సిబ్బంది నాలుగు నెలల పెండింగ్​ జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. 

ఏడాదికోసారి ట్రాన్స్​ఫర్లు చేపట్టాలి

ప్రభుత్వ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని హెల్త్​ మినిస్టర్​ దామోదర రాజనరసింహాకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) గాంధీ యూనిట్​ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కెరీర్​ అడ్వాన్స్​మెంట్​, టైం బౌండ్​ ప్రమోషన్లు అమలు చేయాలన్నారు. డాక్టర్లకు ప్రతీ ఏడాది ట్రాన్స్​ఫర్లు నిర్వహించాలని కోరారు. టీజీడీఏ గాంధీ యూనిట్​ ప్రెసిడెంట్​ భూపేందర్​రాథోడ్​, సెక్రటరీ జనరల్​ అబ్బయ్య, నాయకులు మురళి, కల్యాణ్​ చక్రవర్తి, రవి, సుబోధ్​ కుమార్, నవీన్​ పాల్గొన్నారు.