- రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా
గోదావరిఖని, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో హత్యలు, దోపిడీలు, అల్లర్లు, అత్యాచారం, మోసం, హత్యాయత్నం వంటి నేరాలు గతేడాదితో పోల్చితే ఈసారి తగ్గాయని సీపీ అంబర్ కిశోర్ఝా తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. జిల్లాలో నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఆయన శనివారం తన ఆఫీస్‌లో విడుదల చేశారు.
ఈ ఏడాది నేరాల వివరాలు
రాబరీ కేసులు గతేడాది 5, ఈ ఏడాది 3, దొంగతనాలు గతేడాది 79, ఈసారి 83, మర్డర్లు నిరుడు 17, ఈ సంవత్సరం 14, కిడ్నాప్‌లు గతేడాది 20, ఈసారి 21, రేప్‌లు నిరుడు 36, ఈ ఏడాది 21, మోసాలు గతేడాది 321, ఈ సంవత్సరం 292, అటెంప్ట్మర్డర్లు నిరుడు 51 ఉంటే ఈసారి 30, మిస్సింగ్కేసులు గతేడాది 251, ఈ ఏడాది 235 నమోదయ్యాయని సీపీ తెలిపారు. నిరుడు రోడ్డు ప్రమాదాల్లో 122 మంది, ఈ ఏడాది 137 మంది మృతిచెందారని పేర్కొన్నారు.
వివిధ కేసుల్లో 2024లో 82 మందిని బైండోవర్ చేయగా, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 469 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం 108 సైబర్‌క్రైం కేసులు నమోదు కాగా.. 10 మందిని అరెస్ట్ చేశామని, 80 కేసులు పరిష్కరించి రూ.55.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు.
లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించిన మరో 143 కేసులకు సంబంధించి రూ.13.83 లక్షలను బాధితులకు ఇప్పించినట్లు పేర్కొన్నారు. 41 కేసుల్లో 59 మందికి జైలుశిక్ష పడిందన్నారు. తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 22 మందిపై రౌడీషీట్, 22 మందిపై సస్పెక్ట్ షీట్ఓపెన్ చేసినట్లు చెప్పారు. చైన్‌స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న 22 మందిపై ఐదు గ్యాంగ్ఫైల్స్ ఓపెన్ చేసినట్లు తెలిపారు.
57 పోక్సో కేసులు
పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది 57 పోక్సో కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. షీ టీమ్స్ ద్వారా 362 మంది ఈవ్ టీజర్స్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. నూతన సంవత్సరంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తామని, మత్తు పదార్థాల రహిత కమిషనరేట్ కు కృషి చేస్తామని పేర్కొన్నారు. డీసీపీలు రాంరెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, ఏసీపీలు రమేశ్, నాగేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
