- మంత్రి పొన్నం ప్రభాకర్
- రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
కరీంనగర్, వెలుగు: రాష్ట్ర అథ్లెట్లు ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తానని, అంతర్జాతీయ అథ్లెట్ మర్రి లక్ష్మారెడ్డి తనకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు.
ఈ రోజుల్లో ప్రజలకు శారీరక శ్రమ తక్కువై అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ఉదయం లేవగానే వాకింగ్ చేయాలన్నారు. క్రీడాకారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినట్టు తెలిపారు. అనేక జాతీయ స్థాయి క్రీడలు హైదరాబాద్, ఇతర జిల్లాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు.
