జోరుగా విందు రాజకీయాలు.. క్యాడర్ చేజారకుండా బీఆర్ఎస్​ హై కమాండ్ చర్యలు

జోరుగా విందు రాజకీయాలు..  క్యాడర్ చేజారకుండా బీఆర్ఎస్​ హై కమాండ్ చర్యలు

వెలుగు నెట్​వర్క్:  టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్న చోట్ల వాళ్ల వెంట క్యాడర్ ​వెళ్లకుండా ​బీఆర్ఎస్ హై కమాండ్ అలర్ట్​ అయింది. క్యాడర్​ను కాపాడుకునే బాధ్యతను అక్కడి  క్యాండిడేట్లకు అప్పగించింది. దీంతో కొద్దిరోజులుగా ఆయా నియోజకవర్గాల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలతో  అభ్యర్థులు సమావేశాలు పెడ్తున్నారు. పార్టీకి అండగా ఉండాలని,  పార్టీ వారి భవిష్యత్​ చూసుకుంటుందని, లోకల్​బాడీ  ఎన్నికల్లో మళ్లీ వాళ్లకే టికెట్​ ఇప్పిస్తామని భరోసా ఇస్తున్నారు.  లోకల్​ కాంట్రాక్టులు ఇస్తామని, వాళ్లు చెప్పినవారికే   స్కీమ్​లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. సర్పంచుల పెండింగ్​ బిల్లులు చెల్లిస్తామని, నజరానాలు ఇస్తామని ఆశ పెడ్తున్నారు. కొన్నిచోట్ల నేతల మీద ఉన్న పాత కేసులను  ఎత్తేస్తున్నారు.

మైనంపల్లి ఇంటి వద్ద  మెదక్​ ఎమ్మెల్యే మనుషుల నిఘా

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  ఆయన కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా   మెదక్  నుంచి  పోటీ చేయబోతున్నారు. దీంతో  రోహిత్ ​వెంట ఎవరెవరు  వెళ్లనున్నారన్న విషయాన్ని  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వర్గం ఆరా తీస్తోంది.  హైదరాబాద్ లోని  మైనంపల్లి  ఇంటి దగ్గర ఎమ్మెల్యే పద్మ మనుషులు కాపు కాసి..మెదక్  నుంచి  పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు  ఎవరు కలుస్తున్నారో లెక్క తీస్తున్నారు.  పద్మా దేవేందర్ రెడ్డి పై అసంతృప్తితో ఉన్న మండల స్థాయి నాయకులకు మంత్రి హరీశ్ రావు స్వయంగా ఫోన్ చేసి పాత విషయాలు మరిచిపోయి  పార్టీ   గెలుపు కోసం పనిచేయాలని, పదవుల్లో, పనుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని నచ్చచెప్తున్నట్టు   తెలిసింది.

ఉమ్మడి ఆదిలాబాద్​లో రెండుచోట్ల.. 

ఖానాపూర్​ నియోజకవర్గంలో సిట్టింగ్​ఎమ్మెల్యే రేఖా నాయక్  వెంట ఉన్న పార్టీ లీడర్లపై క్యాండిడేట్​ జాన్సన్​ నాయక్​ ఫోకస్​ పెట్టారు.  ప్రభుత్వ స్కీమ్​ల ఆశ చూపి క్యాడర్​ను, లోకల్​బాడీ లీడర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. వాళ్లు చెప్పిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ,  మైనారిటీలకు ఆర్థికసాయం  ఇప్పిస్తానంటూ ఆకట్టుకుంటున్నారు.  కేటీఆర్ తో జాన్సన్ నాయక్​కు సాన్నిహిత్యం ఉండడంతో చాలామంది  సీనియర్లు  ఆయనకు దగ్గరవుతున్నారు.  ఖానాపూర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనుల కోసం ఇటీవల రూ. 25 కోట్లు మంజూరు చేయించిన జాన్సన్​  ప్రతి కౌన్సిలర్ కు రూ. కోటి   పనులను కేటాయించడం విశేషం. 
ఆదిలాబాద్ జిల్లా బోథ్  ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వెంట ఉన్న క్యాడర్ ఇప్పుడు అనిల్ జాదవ్  వైపు వెళ్తోంది. మంత్రి కేటీఆర్​తో మాట్లాడి   లోకల్​బాడీలకు ఫండ్స్​ ఇప్పిస్తానని అనిల్​ హామీ ఇవ్వడంతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలంతా అనిల్​జాదవ్​కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి పాలమూరులో.. 

వనపర్తి జిల్లాలో పెద్ద మందడి, ఖిల్లా ఘనపురం మండలాలకు చెందిన పలువురు సర్పంచులు    పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి వెంట కాంగ్రెస్ లోకి వెళ్లారు.  జీపీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలువురు సర్పంచులను సస్పెండ్​ చేసే అవకాశం ఉందన్న  ప్రచారంతో  వాళ్లపై రూలింగ్​ పార్టీ ఫోకస్​ పెట్టింది. తిరిగివచ్చిన వారికి  పనుల్లో, పార్టీలో  ప్రాధాన్యం ఇస్తామని,  పెండింగ్  బిల్లులు చెల్లిస్తామని పార్టీ నేతలు బుజ్జగిస్తుండడంతో కొందరు బీఆర్​ఎస్​లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇక  కాంగ్రెస్​లో చేరాలని  నిర్ణయించుకున్న నాగర్​కర్నూల్​ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వెంట  పార్టీ లీడర్లు వెళ్లకుండా  కార్పొరేషన్​ చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, రాజా వరప్రసాద్​ను రంగంలోకి దింపారు. వీరిద్దరూ నారాయణరెడ్డితో సన్నిహితంగా ఉన్నవాళ్లకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు.  జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్​కు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోన్​ చేసి నచ్చచెప్తున్నారు. కల్వకుర్తి,  నాగర్​ కర్నూల్​, కొల్లాపూర్ లకు చెందిన  సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల అనుచరులకు   దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి స్కీమ్​లు కేటాయిస్తామని ఆశచూపుతున్నారు. 
 
మీటింగుల్లో పల్లా టాప్​.. 

జనగామ నియోజకవర్గంలోని పార్టీ లీడర్లను, ముత్తిరెడ్డి అనుచరులను తనవైపు తిప్పుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి మీటింగుల మీద మీటింగులు పెడ్తున్నారు. హైదరాబాద్ లోని తన విద్యాసంస్థలు, ఇంటికి తరచూ పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం లీడర్లను తన స్వగ్రామం  షోడశపల్లికి  పిలిపించుకొని విందు ఇచ్చారు. రాఖీ పండుగనాడు  నియోజకవర్గానికి చెందిన మహిళా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,  సర్పంచులను హైదరాబాద్​ పిలిపించి రాఖీ కట్టించుకొని విలువైన బహుమతులు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ప్రగతిభవన్​లో  పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలతో కేటీఆర్ భేటీ అయిన మరుసటి రోజు కూడా ఇక్కడి లీడర్లను పల్లా  హైదరాబాద్  పిలిపించుకుని.. బచ్చన్నపేటకు వ్యవసాయ మార్కెట్, చేర్యాలకు రెవెన్యూ డివిజన్,  జనగామ, చేర్యాలకు ఇంటర్నల్​ రోడ్లను ఎన్నికల ముందే మంజూరు చేయిస్తానని  మాటిచ్చారు. అటు స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలో టికెట్​ కన్​ఫర్మ్ అయిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులను  తన వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడ్తున్నారు. మాదిగల ఓట్లు తనవైపే ఉంటాయన్న విశ్వాసంతో  రాజయ్య  కాంగ్రెస్ లోకి వెళ్లాలని  ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయన వెంట బీఆర్​ఎస్​ క్యాడర్​ ఎవరూ వెళ్లకుండా కడియం నేతలతో టచ్​లోకి వెళ్తున్నారు. 

భద్రాద్రి జిల్లాలో  ముగ్గురు ఎమ్మెల్యేల పాట్లు..


భద్రాద్రికొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య  కాంగ్రెస్​లోకి  వెళ్లారు. ఆయన  ఇల్లెందు నుంచి  పోటీ చేయనున్నారు. దీంతో పార్టీ  నేతలను కాపాడుకునేందుకు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ శ్రమిస్తున్నారు. లోకల్​ లీడర్లు సూచించిన వారినే దళితబంధు, గృహలక్ష్మి  స్కీంలకు ఎంపిక చేస్తున్నారు.  కొత్తగూడెంలోనూ వనమా వెంకటేశ్వరరావు లబ్ధిదారుల ఎంపికలో లోకల్​ లీడర్లకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన వెంట పార్టీ క్యాడర్​ వెళ్లకుండా వనమా  ప్రయత్నిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వెంట పినపాక నియోజకవర్గానికి చెందిన లీడర్లు వెళ్లకుండా ఎమ్మెల్యే రేగా కాంతారావు దళితబంధు  ఆశ చూపుతున్నారు. కాంట్రాక్ట్ వర్క్స్ ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారు.