బాసర ట్రిపుల్​ ఐటీని గాడిలో పెట్టేందుకు చర్యలు

బాసర ట్రిపుల్​ ఐటీని గాడిలో పెట్టేందుకు చర్యలు
  • మెస్, టెండర్లు, ఫైనాన్స్ అంశాలపై ఫోకస్  
  • స్టాఫ్, స్టూడెంట్ల సౌకర్యాలకు ప్రయార్టీ  
  • లోపాల సవరణకు త్వరలో కీలక మార్పులు

హైదరాబాద్, వెలుగు:  బాసర ట్రిపుల్​ఐటీ(ఆర్జీయూకేటీ)ని గాడిలో పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. స్టూడెంట్లు, స్టాఫ్​కు మెరుగైన సౌలతులు కల్పించడంతో పాటు సిబ్బంది లోపాలపైనా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు వర్సిటీ అధికారులు రెడీ అవుతున్నారు. అయితే ఆర్జీయూకేటీలో పలు రిఫామ్స్ తేవడం కోసం బెస్ట్ ప్రాక్టీసెస్ కమిటీ పేరుతో జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు, ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రతాప్​రెడ్డిలతో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, ఇన్​చార్జీ వీసీ వెంకటరమణ త్రీమెన్ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు శుక్రవారం వర్సిటీ డైరెక్టర్ సతీశ్​ కుమార్ తో సమావేశమయ్యారు. ఏండ్ల నుంచి వీసీ, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆర్జీయూకేటీ అడ్మినిస్ర్టేషన్ అస్తవ్యస్తంగా మారింది. దీన్ని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మీటింగ్​లో చర్చించారు. కమిటీ సభ్యులు సూచనలు అందించారు. అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, యూనిఫామ్స్, షూస్, మెస్, టెండర్ల అంశాలతో పాటు సిబ్బంది, స్టూడెంట్లపై క్రమశిక్షణ చర్యలపై చర్చించారు. సిబ్బందికి రెగ్యులర్ గా మోటివేషన్ క్లాసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.  

మెస్​లపై కీలక నిర్ణయం 

త్వరలోనే మెస్ టెండర్లను పిలిచేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఒకే సంస్థకు కాకుండా 3, 4 సంస్థలకు  వేర్వేరుగా కాంట్రాక్టు ఇవ్వాలని త్రిసభ్య కమిటీ సూచించినట్టు తెలిసింది. ముందుగా స్టూడెంట్లకు అలాట్ చేసి, ఆ తర్వాత వారికి ఎక్కడ నచ్చితే అక్కడ తినేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. అయితే వారం ముందే స్టూడెంట్లు సంబంధిత అధికారికి సమాచారం ఇస్తే, వారికి ప్రత్యేక కార్డు ద్వారా కనీసం నెల ఎక్కడైనా తినే వెసులుబాటు కల్పించనున్నట్టు సమాచారం. దీనివల్ల స్టూడెంట్లకు నచ్చిన భోజనం తినే అవకాశముంటుంది. ఈ నిర్ణయం అమలుపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

సిబ్బందికి పే స్కేల్ 

వర్సిటీలో రెగ్యులర్ సిబ్బందికి యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సర్కారు రూల్స్​ ప్రకారం జీతాలు చెల్లించాలని త్రిసభ్య కమిటీ సూచించినట్టు సమాచారం. ప్రతి స్టాఫ్ మెంబర్​కు ఏదో ఒక అడిషనల్ బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. సిబ్బంది ఎన్ని సెలవులు తీసుకోవచ్చు? వర్సిటీ వ్యతిరేక, సర్కారు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే రూల్స్​ ప్రకారం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై సలహాలు ఇచ్చినట్టు తెలిసింది. మరోపక్క ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తంగా ఉండాలని, క్యాష్ బుక్ రెగ్యులర్​గా మెయింటెన్ చేయాలని, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా ఉండేలా చూడాలని కమిటీ సూచించింది. కష్టపడితే వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా సెట్ అవుతుందని, అందరి సహకారంతో ముందుకు పోవాలని చెప్పినట్లు తెలిసింది.