అర్హులకే ఇండ్లు ఇచ్చేలా చర్యలు

అర్హులకే ఇండ్లు ఇచ్చేలా చర్యలు

నిర్మల్,వెలుగు: పేదలకు దక్కాల్సిన డబుల్​ బెడ్​రూం ఇండ్ల మంజూరులో పైరవీలు, అక్రమాలకు చెక్​పెట్టేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. అర్హులకే ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. దీంతో నిర్మల్​లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పలుమార్లు వాయిదా పడింది. జిల్లాలో ఇప్పటి వరకు 2,450 డబుల్ ​బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 2,029 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మల్​ టౌన్​లో1,460  ఇండ్లు పూర్తయ్యాయి. ఆఫీసర్లు ఇండ్ల పంపిణీకి రెడీ అయ్యారు. దసరా నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే  మొదటి నుంచి డబుల్ బెడ్​రూం ఇండ్ల పైరవీలపై ఆశలు పెట్టుకున్న కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు, లీడర్లు, దళారులకు కలెక్టర్ ​ముషారఫ్​ అలీ షాక్​ ఇచ్చారు. దరఖాస్తులను  స్వయంతో స్క్రూటీని చేసిన ఆయన 5,248 మంది ఇల్లు పేదలను గుర్తించారు. మరో సారి రీవెరిఫికేషన్ చేసి ఏండ్ల నుంచి ఇండ్లు లేకుండా కిరాయి ఇండ్లలో ఉంటున్న వారిని గుర్తించాలని నిర్ణయించారు. మున్సిపల్  కౌన్సిలర్లు, అధికార పార్టీ లీడర్ల ప్రమేయం లేకుండా చేసేందుకు రెవెన్యూ, మున్సిపల్​, సహకార ​శాఖల ఆఫీసర్లతో వార్డుల వారీగా టీంలు ఏర్పాటు చేశారు. వీరంతా దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉంటున్న ఇల్లు ఎక్కడిది? అది సొంతమా? కిరాయి ఇల్లా?  తెలుసుకుంటున్నారు. సర్వే సందర్భంగా కౌన్సిలర్లు, టీఆర్ఎస్​ లీడర్లు దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇరుగుపొరుగు వారికి ఫోన్​చేసి ఆరా తీస్తున్నారు. సర్వే పూర్తి కాగానే అర్హుల జాబితా రెడీ చేయనున్నారు. 

పైరవీలకు చెక్​  పెట్టేందుకే సర్వే...

డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన నాటి నుంచి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మరి కొంత మంది ప్రజాప్రతినిధులు తమ తమ అనుచరులకు ఇండ్లు ఇప్పించుకునేందుకు పైరవీలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వచ్చిన ఆరోపణలపై మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. దీంతో కలెక్టర్ ​స్వయంగా రంగంలోకి దిగారు. పైరవీలను చెక్​ పెట్టేందుకు సీక్రెట్​సర్వేకు చర్యలు తీసుకున్నారు. నిర్మల్ టౌన్​పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకున్న 1,460 డబుల్​ బెడ్​ రూం ఇండ్లను అర్హులైన వారికే పంపిణీ చేయాలని నిర్ణయించారు. బంగల్​పేటలోని 444 ఇండ్లు, నాగనాయిపేటలోని 1,016 ఇండ్లను అర్హులకు ఇవ్వనున్నారు. మొత్తం ఇండ్ల నిర్మాణాల కోసం రూ. 144 కోట్లను ఇప్పటి వరకు ఖర్చు చేయగా.. మరో రూ. 24 కోట్లను సంబంధిత కాంట్రాక్టర్​కు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. డబుల్ బెడ్​రూం ఇండ్లల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఇటీవల ప్రభుత్వం రూ. 7.70 కోట్లను కూడా మంజూరు చేయడంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలపై  ఆర్థిక భారం తప్పింది. 

దసరాలోగా ఇస్తాం....

ఇప్పటికే పూర్తయిన డబుల్​బెడ్​రూం ఇండ్లను దసరా పండుగ నాటికి అర్హులకు అందజేస్తాం. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇండ్లు లేని పేదలకు ప్రాధాన్యం ఇస్తాం. ఎలాంటి పైరవీలకు తావులేదు.

-  కలెక్టర్​ముషారఫ్​అలీ ఫారూఖీ