ఒక వ్యక్తి తాలూకా జ్ఞాపకాలు చాలా గొప్పవి. మనతో ఉండే వాళ్ళు బతికి ఉన్నప్పుడు.. వారికీ అందనంత ప్రేమను ఇవ్వాలి. ఎప్పుడూ నవ్వుతూ పలకరించాలి. మనకంటే పెద్దవారైతే అభిమానంతో నమస్కరించాలి. అప్పుడే ప్రతి మనిషిలో ప్రేమను చూడగలం. ఇలాంటి ఓ మహోన్నతమైన ప్రేమను పొందారు బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బి అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). కానీ, అలాంటి ఓ వ్యక్తి ప్రేమ దూరం అవ్వడంతో ఎమోషనల్ అయ్యారు. తన దగ్గర 27ఏళ్లకు పైగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ అశోక్ దాదా (Ashok Sawant) మరణించారంటూ.. అభిషేక్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘‘అశోక్ దాదా.. నా దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్నాడు. నా ఫస్ట్ సినిమా నుంచి అశోక్ దాదే నాకు మేకప్ వేస్తున్నారు. ఆయన కేవలం నా టీమ్‌లో ఒక వ్యక్తి మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో ఒకరు. నేను చేసీ ప్రతి సినిమాకు ముందు.. ఫస్ట్ అశోక్ దాదా కాళ్లకు నమస్కరించిన తర్వాతే సెట్కి వెళ్లి కెమెరా ముందు నిల్చుంటాను. ఆశీర్వాదం తీసుకుంటాను. అలా ఆయన లేకుండా ఏ రోజు కూడా సెట్ కి వెళ్ళిందే లేదు. కానీ, ఇప్పటినుంచి తన కోసం ఆకాశంవైపు చూస్తాను. ఆయన మా మధ్య లేకపోవడం బాధాకరం.
స్వర్గంలో ఉన్న ఆయన కిందకి చూస్తూ నన్ను కచ్చితంగా దీవిస్తాడు. నీ ప్రేమాభిమానాలకు, కేరింగ్‌కు, టాలెంట్‌కు.. అన్నింటికీ థాంక్యూ దాదా. నువ్వు నాతో లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇకపై నువ్వు లేకుండానే సెట్‌కు వెళ్లాలని తల్చుకుంటేనే మనసు ముక్కలవుతోంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..’’ అంటూ అభిషేక్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో బాలీవుడ్ సెలెబ్రెటీలు అభిషేక్కు ధైర్యం చెబుతూ అశోక్ దాదా మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
