ఈడీ విచారణకు హాజరైన నటుడు జగపతి బాబు.. నాలుగు గంటలు ప్రశ్నించిన అధికారులు

ఈడీ విచారణకు హాజరైన నటుడు జగపతి బాబు.. నాలుగు గంటలు ప్రశ్నించిన అధికారులు

సాహితీ ఇన్ ఫ్రా కేసులో  నటుడు జగపతిబాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు.  గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఈడీ ఆఫీసులో ఆయనను  అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. 

సాహితీ ఇన్ ఫ్రా తరపున హీరో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో జగపతిబాబు, సాహితీ మధ్య ఆర్థిక లావాదేవీలుపై అధికారులు ప్రశ్నించారు. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్ నుంచి జగపతిబాబు కు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు అధికారులు. 

పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినందున జగపతిబాబును పిలిచి విచారించింది ఈడీ. సాహితీ నుంచి వచ్చిన డబ్బులకు సంబంధించి సమాచారాన్ని జగపతిబాబు నుంచి తెలుసుకున్నారు. 

సాహితీ ఇన్ ఫ్రా కేసు:

ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట 655 మంది కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి, నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడింది. దీంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. 

ఎస్‌ఐవీఐపీఎల్‌ మాజీ డైరెక్టర్‌  పూర్ణచంద్రరావు 2018 ఆగస్టు నుంచి 2020 మధ్య కాలంలో రూ.126కోట్లు కొనుగోలు దారుల నుంచి వసూలు చేసినట్టు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తులను తన పేరిట,తన కుటుంబ సభ్యుల పేరిట పూర్ణచంద్రరావు కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీస్ తో పాటు ఈడీ తన దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

 

సాహితీ కేసులో మరింత లోతైన విచారణలో  భారీ ఎత్తున ఫ్రాడ్ జరిగినట్లు ఈడీ అధికారులు ఉర్తించారు. ఫ్రీలాంచ్ విల్లా, ఫ్లాట్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా దాదాపు 700 మంది కస్టమర్ల నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. సాహితీ పేరుతో వసూలు చేసిన డబ్బులు మొత్తం రూ.120 కోట్లను డైరెక్టర్ పూర్ణచందర్ మళ్లించినట్లు తెలుస్తోంది. 

సాహితీ లక్ష్మీనారాయణ తో కలిసి 216 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. 50 కోట్ల రూపాయలను హవాల రూపంలో మళ్లించారని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. 

సాహితీ ఇన్ ఫ్రా సంస్థ రూ.126 కోట్లతో 21 ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 161 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. లేటెస్ట్ గా డైరెక్టర్ ను అరెస్టు చేయడంతో మరిన్ని ఆధారాలు సేకరించనుంది ఈడీ.