Kamal Haasan Controversy: కన్నడ భాష పుట్టుకపై కమల్ వ్యాఖ్యలు.. కర్ణాటకలో పెను దుమారం

Kamal Haasan Controversy: కన్నడ భాష పుట్టుకపై కమల్ వ్యాఖ్యలు.. కర్ణాటకలో పెను దుమారం

స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌ లైఫ్’.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను నా కుటుంబంలో అందరూ తమిళులే. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. ఈ తమిళ-కన్నడ వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. కన్నడ అనుకూల సంఘాలు క్షమాపణలు కోరుతూ కర్ణాటకలో ‘థగ్‌ లైఫ్’సినిమానునిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే, ‘థగ్‌ లైఫ్‌’ఈవెంట్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ కమల్‌ హాసన్‌ మాట్లాడారు. ‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’అని  అన్నారు. దీంతో ఇపుడీ ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర రాజకీయ ప్రతిచర్యలకు, ప్రజల ఆగ్రహానికి దారితీసింది.

కమల్ ఇలా మాట్లాడటం కర్ణాటకలోని చాలా మందికి నచ్చలేదు. కన్నడ రక్షణ వేదిక వంటి సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలను వెంటనే ఖండించాయి. కమల్ మాట్లాడిన ఈ మాటలు కన్నడ భాష మరియు సంస్కృతిని అగౌరవపరిచేవిగా ఉన్నాయని అంటున్నారు. 

ఈ విషయంపై కర్ణాటక భాజపా అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప స్పందించారు. ' ఎవ్వరి భాషను వారు ప్రేమించడం మంచిదే. కానీ, ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా కళాకారులు ప్రతి భాషను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలి.

కన్నడతో సహా అనేక భారతీయ భాషలలో నటించిన నటుడు ఇలా మాట్లాడటం వారి కృతజ్ఞత లేని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. కమల్ హాసన్, గత కొన్ని సంవత్సరాలుగా హిందూ మతాన్ని నిరంతరం అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నాడు.

ఇప్పుడు, ఆరున్నర కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ కన్నడను అవమానించాడు. కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని " విజయేంద్ర యడియూరప్ప డిమాండ్ చేశారు. మరి ఈ వివాదం పట్ల కమల్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటాడనేది ఆసక్తి నెలకొంది. కమల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది.