తిరుమల శ్రీవారి సేవలో కీర్తి సురేష్

తిరుమల శ్రీవారి సేవలో కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్  శనివారం( మే 27) తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తన సోదరి రేవతి సురేష్, మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కీర్తి సురేష్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.


అయితే, దర్శనానంతరం కీర్తి సురేష్ ఆలయం నుంచి బయటికి వచ్చే సమయంలో అక్కడ చాలా హడావుడి కనిపించింది. కీర్తి సురేష్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆలయ సెక్యూరిటీ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులు ఎగబడ్డారు. కీర్తి సురేష్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించాడని ఎవరిపాట్లు వారు పడ్డారు. వీరి మధ్య నుంచి కీర్తి సురేష్‌ను టీటీడీ సిబ్బంది సురక్షితంగా తీసుకెళ్లి బ్యాటరీ వాహనం ఎక్కించారు. అప్పుడు కూడా కీర్తి సురేష్‌ను ఫొటోలు తీయడానికి జనం ఎగబడ్డారు. బ్యాటరీ వాహనాన్ని చుట్టుముట్టారు. వాహనంతో పాటే వెళ్తూ ఫొటోలు తీసుకున్నారు. కీర్తి సురేష్ మాత్రం అందరికీ నవ్వుతూ అభివాదం చేశారు. ఇక బ్యాటరీ వాహనం నుంచి తన కారులోకి ఎక్కే సమయంలోనూ కీర్తి సురేష్‌‌తో ఫొటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. . చాలా రోజుల తరవాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అక్క రేవతి సురేష్ తొలి షార్ట్ ఫిల్మ్ విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తున్నట్లు చెప్పారు