
కొంత గ్యాప్ తర్వాత నాగార్జున హిందీలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ ఇది. మూడు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో తన పాత్రకి సంబంధించిన షూటింగ్‌ని ఇప్పటికే పూర్తి చేశారు నాగ్. దాదాపు అరగంట వరకూ తన క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని గతంలో చెప్పిన ఆయన, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలను రివీల్ చేశారు. ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. తన పాత్ర నిడివి కంటే క్యారెక్టరైజేషన్ నచ్చి ఈ సినిమాకి అంగీకరించానని నాగ్ చెప్పారు. మైథాలజీపై ఉన్న ఆసక్తి కూడా ఈ సినిమాకి సైన్ చేయడానికి ఓ కారణమన్నారు. పురాతన దేవాలయాలపై పరిశోధన చేసే ఆర్కియాలజిస్టుగా నాగ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. తన స్టూడెంట్స్‌తో కలిసి ఓ టూర్‌కి వెళ్లిన నాగ్‌కి ఎదురైన ఇన్సిడెంట్స్ నుండి కథ ఐదువేల సంవత్సరాల క్రితం నాటి కథతో ఈ సినిమా ఉంటుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌనీరాయ్, సౌరవ్ గుర్జర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇంకాస్త షూటింగ్ పెండింగ్ ఉంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక దాన్ని కూడా కంప్లీట్ చేసి, వీలైనంత త్వరగా మూవీని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోపు ప్రమోషన్స్‌కి రెడీ అవుతున్నారు నిర్మాతలు. ఆల్రెడీ పది టీజర్లు, పదమూడు మోషన్ పోస్టర్లు రెడీ చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నాగ్ కూడా ఓ భాగమైనందుకు ఆయన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.