
నేను హీరోని కాను, నటుడిని అంటుంటాడు రానా. చెప్పడమే కాదు, అలాంటి సినిమాలే చేస్తాడు కూడా. ఇటీవల ‘భీమ్లానాయక్’లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించిన రానా.. ఆ సినిమా గురించి, తన కెరీర్ గురించి ఇలా చెప్పాడు.
మాస్ సినిమాలంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చూశాక అర్థమైంది. ఒక కల్ట్ నేచర్ సినిమాని మెయిన్ సీట్రమ్ చేయడం హీరో వల్లే సాధ్యం. నాకు వకీల్ సాబ్ టైమ్ ల ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. మిగతా ఇండస్ట్రీస్ అన్నీ స్టోరీ టెల్లింగ్ చేస్తుంటే..తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఫిల్మ్ మేకింగ్ చేస్తోందని.మనం సేమ్ స్టోరీనే డిఫరెంట్ మేనర్ లో చెబుతున్నాం.
- ‘భీమ్లానాయక్’ రిలీజ్ టైమ్‌లో ముంబై షూట్‌లో ఉన్నాను. అక్కడి తెలుగువాళ్ల మధ్య సినిమా చూశాను. అక్కడే అలా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించాను. వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి జానర్స్‌ని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సపోర్ట్ చేస్తున్నందుకు హ్యాపీ.
- ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ చూస్తే.. సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎండింగ్ వరకూ అదే ఎమోషన్ కనిపించింది. పైగా మూడు గంటల సినిమా. అలా ఎలా తీశారా అనిపించింది. నేను చేసిన పాత్ర ‘ఐరన్ మ్యాన్’లో రాబర్ట్ డౌనీ జూనియర్ చేసిన క్యారెక్టర్‌కి దగ్గరగా ఉంటుంది. అతను ఎవరికీ నచ్చని పనులు చేస్తుంటాడు. కానీ అవి మనకు నచ్చుతుంటాయి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఈ పాత్ర కూడా అలా ఉండబట్టే నటించాను. సినిమా చూసి నాన్న చాలా శాటిస్‌ఫయింగ్ అన్నారు. మామూలుగా ఆయన అలాంటి పెద్ద పదాలు వాడరు. అన్నారు అంటే అదే నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్.
- ఓ భాషలో హిట్ అయిన మూవీ స్టోరీ తీసుకుని డిఫరెంట్‌గా మలచడం చాలా కష్టం. బాబాయి చాలా రీమేక్ సినిమాలు చేశారు. కానీ అవన్నీ ఒరిజినల్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. మేకింగ్ టైమ్‌లో చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఒరిజినల్ బాగా ఆడింది కనుక చెడగొట్టడం ఎందుకనే భయం ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మలయాళ కల్చర్ నుంచి బయటకు వచ్చేశాం. కొన్ని సీన్స్ అయితే యాజిటీజ్‌గా తీసి కూడా, మళ్లీ మన కల్చర్‌కు తగ్గట్టు మార్చి తీశారు.
- డ్యానీ క్యారెక్టర్‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. మంచి భర్త. ఆడవాళ్లను గౌరవిస్తాడు. ఆర్మీ అధికారి. ఇలాంటి చాలా మంచి విషయాలు ఉండబట్టే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. తండ్రి, చుట్టూ ఉన్న పరిస్థితులు, పోలీసులు తనను పట్టుకోవడం ఏమిటి అనే ఈగో వల్ల అలా మారిపోతాడు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నీట్‌గా మాట్లాడుతూ, మరొకరు తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎంటర్‌టైన్ చేస్తున్న రెండోవాడే నచ్చుతాడు. నటనలో పవన్ కళ్యాణ్ గారిని నేను డామినేట్ చేశాననడం అలాంటిదే. ఎక్కువ మంది అలా అంటున్నారంటే డ్యానీ లాంటోళ్లే ఎక్కువ ఉన్నట్టు. (నవ్వుతూ)
- చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగాను. అందుకే నేను సినిమాలు చూసే విధానమే వేరుగా ఉండేది. ఐదో తరగతిలో ఉన్నప్పుడే స్టీన్ బెక్ ఎడిటింగ్ నేర్చుకున్నా. నేను ఇప్పటివరకూ చూడనిది చేయాలని ఉంటుంది నాకెప్పుడూ. కథ కాకుండా దాన్నుంచి బయటికొచ్చే ఏ ఎలిమెంట్ అయినా స్విచాఫ్ అవుతాను. సినిమాల్లో పాటలు వస్తుంటే దాన్నుంచి కట్ అవుతాను. ఆ పాట కంటే ముందు ఏం జరిగింది, తర్వాతేం జరగబోతోందనే దానిపైనే ఫోకస్ ఉంటుంది. కథ జరిగేటప్పుడు కథే జరగాలి. అందుకే పాటలు, ఫైట్స్ లేకుండా సినిమా చేసి హిట్ కొడతానని నాన్నకు చెబుతుంటా.
- సోలో హీరోగా కమర్షియల్ సినిమాలు చేయమని ప్రేక్షకులు ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు చేస్తాను. ‘రానానాయుడు’ అనేది కమర్షియల్ ఎంగేజ్డ్ వెబ్ సిరీస్. బాబాయి, నేను వేరే జానర్‌లోకి ఎంటరయ్యి చేశాం. ఎనిమిది గంటల షో కావడంతో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. అందుకే ఇది అయ్యాకే మిగతా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తా.