సాయిధ‌న్సిక అభిన‌యం అద్భుతం

సాయిధ‌న్సిక  అభిన‌యం అద్భుతం

హైదరాబాద్: సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, కేవీ ధీరజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘షికారు’. నాగేశ్వరి సమర్పణలో శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై పీఎస్‌ఆర్‌ కుమార్‌ (బాబ్జీ) నిర్మిస్తున్నారు. హరి కొలగాని దర్శకుడు. జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్లలో భాగంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ధ‌న్సిక  మాట్లాడుతూ.. షికారు సినిమాలో మొద‌టినుంచి పోస్టర్‌లో అంద‌రిని చూపించారు. ఇందులో క‌నిపిస్తున్న అంద‌రూ స్టార్సే. ఇలా డిజైన్ చేసిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు ధ‌న్యవాదాలు. ఈరోజు ఇంత ఆద‌ర‌ణ పొందేలా ఉండ‌డానికి కార‌ణం టెక్నీషియ‌న్స్ కృషి. న‌టీన‌టుల అభినయం. న‌లుగు కుర్రాళ్ళ బాగా న‌టించారు. ర‌చ‌యిత క‌ర‌ణ్ నా బాడీ లాగ్వేజ్ ఎలా ఉండాలో తెలియ‌జేస్తూ ఎంక‌రేజ్ చేశారు. అదేవిధంగా ప్రస‌న్నకుమార్‌, బెక్కెం వేణుగోపాల్‌, డి.ఎస్‌.రావు ఎంత‌గానో పాజిటివ్‌తో మొద‌టి నుంచి స్పందించారు. షికారు సినిమాపై బాబ్జీ పూర్తి న‌మ్మకంతో ఉన్నారు. ఇందులో కంటెంట్‌తోపాటు కామెడీ ఎక్కువ‌గా ఉంటుంది. అంద‌రూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

డైరెక్టర్ హ‌రి మాట్లాడుతూ.. నా టీమ్ ఎంతో స‌హ‌క‌రించింది. నెల్లూరులో కాలేజీ స్టూడెంట్స్ స్పందించిన తీరు మేం అనుకున్నట్లుగా ఉండ‌డం చాలా ఆనందంగా ఉంది. వారి జ‌డ్జిమెంట్ మాకు మ‌రింత ఎన‌ర్జీ ఇచ్చింది. ఎడిట‌ర్‌, సుభాష్ మాస్టర్‌. అంద‌రూ స‌హ‌క‌రించారు.  శేఖ‌ర్ చంద్ర ఓపిగ్గా బాణీలు ఇచ్చాడు. భాస్కరభ‌ట్ల పాట‌లు చాలా బాగా రాశాడు. న‌టీన‌టులు ఎంత‌గానో స‌హ‌క‌రించారు. నిర్మాత బాబ్జీగారు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. అభి, తేజ‌, ధీర‌జ్‌, న‌వ‌కాంత్ అంద‌రూ బాగా చేశారు. అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని  తెలిపారు.

నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ.. ఈరోజు చాలా ఆనందంగా వుంది. ట్రైల‌ర్ నుంచి పెద్ద హిట్ అని చెబుతున్నా.  అలాగే జ‌రుగుతుంది. ఈ సినిమాకు అన్నీ స‌రిగ్గా కుదిరాయి. క‌రోనా టైంలో నేను డిప్రెష‌న్‌లో ఉన్నప్పుడు లైన్ ప్రొడ్యూస‌ర్‌ శివ‌కుమార్ ఎంతో  ధైర్యం ఇచ్చారు. నెల్లూరులో జ‌రిగిన ప్రీమియ‌ర్ షో  అద్భుతంగా ఉంద‌ని టాక్ వ‌చ్చింది. స్టూడెంట్స్ కేరింతలు మాకు ఆనందాన్నిచ్చాయి.  సాయిధ‌న్సిక సినిమాకు వెన్నెముక‌. సినిమాను న‌డిపించింది ఆమెనే. అభిన‌యం అద్భుతంగా చేసింది. ఆమెను తెలుగులో ప‌రిచ‌యం చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. మా సినిమాలో వ‌ల్గారిటీ లేదు. ఈ స్టోరీ అంద‌రికి తెలిసిన క‌థే. అహ‌ల్య గురించి అంద‌రికీ తెలుసు. షికారు కూడా అటువంటి క‌థే. అంద‌రికీ న‌చ్చే సినిమా ఇది అని తెలిపారు.